Tirumala Brahmotsavam: తిరుమల బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం, నేడు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్, 9 రోజుల పాటు శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఆదివారం రాత్రి 7–8 గంటల మధ్యలో వైదికంగా అంకురార్పణ చేశారు. వైఖానస ఆగమశాస్త్ర బద్ధంగా ఈ వేడుకను నిర్వహించారు

Tirumala Brahmotsavam Credits: Twitter

తిరుమల (Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముస్తాబయింది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఆదివారం రాత్రి 7–8 గంటల మధ్యలో వైదికంగా అంకురార్పణ చేశారు. వైఖానస ఆగమశాస్త్ర బద్ధంగా ఈ వేడుకను నిర్వహించారు. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందురోజైన ఆదివారం సాయంసంధ్యా సమయంలో శ్రీవారి సర్వ సేనాధి­పతి అయిన విష్వక్సేనుడు ఛత్రచామర, మేళతాళాల నడుమ మాడవీధుల్లో ఊరేగింపుగా బయలుదేరి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం రంగనాయక మండపంలో ఆస్థానం నిర్వహించారు.

సోమవారం సాయంత్రం 6.15–6.30 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తం గా ధ్వజారోహణం నిర్వహించడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. రాత్రి 9 గంటలకు పెద్ద శేషవాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఊరేగనున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చారు.

అక్టోబర్ 31న పైడితల్లి సిరిమానోత్సవం, అక్టోబ‌ర్ 15 నుంచి న‌వంబ‌ర్ 15వ తేదీ వ‌ర‌కు నెల రోజుల పాటు పైడిత‌ల్లి అమ్మ‌వారి ఉత్స‌వాలు

నేడు ముఖ్య‌మంత్రి వైఎస్‌ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తిరుమలలో పర్యటించనున్నారు. తిరుమల శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్‌ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

ఈ నెల 26 వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. తొమ్మిది రోజులపాటు స్వామివారికి తిరుమల తిరువీధుల్లో ఉదయం, రాత్రి వేళల్లో వాహన సేవ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా రేపటి నుంచి ఈ నెల 26 వరకు ఆర్జిత సేవలను టీటీడీ (TTD) రద్దుచేసింది. సోమవారం సాయంత్రం 6.15 నుంచి 6.30 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం జరుగుతుంది. అనతరం పెద్దశేష వాహన సేవతో బ్రహ్మోత్సవాల వాహన సేవలు ప్రారంభమవుతాయి.

తొమ్మిది రోజుల పాటు జరిగే వాహన సేవలు ఇవిగో..

18న సాయంత్రం 6.30 గంటలకు ధ్వజారోహణం జరుగుతుంది. రాత్రి 9 నుంచి 11 గంటల వరకు పెద్ద శేష వాహన సేవ ఉంటుంది.

19న ఉద‌యం 8 నుంచి 10 గంట‌ల‌ వ‌ర‌కు చిన్నశేష వాహన సేవ, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమజనం నిర్వహిస్తారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హంసవాహన సేవ జరుగుతుంది.

20న ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య సింహ వాహ‌న సేవ ఉంటుంది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల మధ్య స్నపనతిరుమంజనం, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ముత్యపుపందిరి వాహన సేవ జరుగుతుంది.

21న ఉదయం 8 నుంచి 10 గంటల వరకు కల్ప వృక్ష వాహన సేవ, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వభూపాల వాహన సేవలు ఉంటాయి.

22న ఉదయం 8 నుంచి 10 గంటల వరకు మోహినీ అవతారంలో స్వామి కనిపిస్తారు. రాత్రి 7 గంటలకు గరుడ సేవ ప్రారంభమవుతుంది.

23న ఉద‌యం 8 నుంచి 10 గంట‌ల‌ వరకు హ‌నుమంత వాహ‌న సేవ ఉంటుంది. అదే రోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య స్వర్ణ రథోత్సవం, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు గజవాహన సేవ నిర్వహిస్తారు.

24న ఉదయం 8 నుంచి 10 గంటల వరకు సూర్యప్రభ వాహనం, మధ్యాహ్నం స్నపనతిరుమంజనం, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనసేవలు ఉంటాయి.

25న ఉదయం 6.55 గంటలకు రథోత్సవం, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు అశ్వవాహన సేవ జరుగుతుంది.

26న ఉదయం 3 నుంచి 6 గంటల వరకు పల్లకీ ఉత్సవం జరుగుతుంది. తిరుచ్చి ఉత్సవం అయిన తర్వాత ఉదయం 6 నుంచి 9 గంటల వరకు స్నపన తిరుమంజనం, చక్రసాన్నం జరుగుతుంది. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయి.