Varalakshmi Vratham 2024: వరలక్ష్మీ వ్రతానికి శుభ ముహూర్తం ఎప్పుడో తెలుసా, వ్రతం పూజా విధానం, పూజా సామాగ్రి తదితర వివరాలు ఓ సారి తెలుసుకోండి

శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని చేసుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ వ్రతం గురించి సాక్షాత్తూ పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పినట్టు ‘స్కాంద పురాణం’ పేర్కొంటోంది. పరమేశ్వరుడికి ప్రీతికరమైన మాసాల్లో శ్రావణ మాసం ఒకటి

Varalakshmi-Vratam-Wishes in Telugu

Varalakshmi Vratham 2024: వరలక్ష్మీ వ్రతం ఈ ఏడాది ఆగస్టు 16వ తేదీన వచ్చింది. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని చేసుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ వ్రతం గురించి సాక్షాత్తూ పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పినట్టు ‘స్కాంద పురాణం’ పేర్కొంటోంది. పరమేశ్వరుడికి ప్రీతికరమైన మాసాల్లో శ్రావణ మాసం ఒకటి. ఈ మాసంలో మహిళలందరూ వ్రతాలు, నోములు, పూజలు చేసుకుంటుంటారు. ఇక ఎక్కువ మంది మహిళలు చేసుకునే వ్రతం వరలక్ష్మీ వ్రతం. వరాల తల్లి వరలక్ష్మీ దేవి అనుగ్రహం కోసం ప్రతి మహిళా తమకు తోచిన విధంగా పూజ చేసుకుంటారు.

శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతం చేసుకోవడం ఆనవాయితీ. ఈ సంవత్సరం ఆగస్టు 16వ తేదీన వరలక్ష్మీ వ్రతం జరుపుకోనున్నారు. సాధారణంగా ప్రతి శుక్రవారం ఉదయం 10:30 నిమిషాల నుంచి 12 గంటల వరకు రాహుకాలం ఉంటుంది. అందుకే పూజను ఉదయం 10:30 లోపు, 12 గంటల తర్వాత కానీ చేసుకోవాలి. ఈ రోజున వరలక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే అమ్మవారి అనుగ్రహంతో సిరి సంపదలు కలుగుతాయని జీవితంలో డబ్బులకు లోటు ఉండదని విశ్వాసం. వరలక్ష్మీ వ్రతం మెసేజెస్ తెలుగులో, ఈ అద్భుతమైన కొటేషన్లతో బంధుమిత్రులకు వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు చెప్పండిలా

వరలక్ష్మీ వ్రతం చేసే గృహిణులు సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతూ ఇంటి ముంగిలిలో అందమైన రంగవల్లులు తీర్చిదిద్దాలి. ఇంటి గుమ్మాన్ని మామిడి తోరణాలతో, పూలమాలలతో అలంకరించుకోవాలి. తలంటు స్నానం చేసి శుచియై పట్టు వస్త్రాలు ధరించాలి.

పూజా సామాగ్రి

పసుపు, కుంకుమ, గంధం, పన్నీరు, అగరుబత్తులు, దీపారాధన కుందులు, ఆవునెయ్యి, ఒత్తులు, కర్పూరం, అక్షింతలు, పూలు, అరటి పండ్లు, అరటి పిలకలు, కొబ్బరికాయలు, తమలపాకులు, వక్కలు, తోరాలు కట్టుకోడానికి నూలు దారం, కలశానికి వెండి/ఇత్తడి/రాగి చెంబు, అమ్మవారికి నూతన వస్త్రాలు, ఆభరణాలు

పూజా విధానం

ముందుగా పూజామందిరంలో మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అరటిపిలకలతో, పుష్ప మాలికలతో, మామిడి కొమ్మలతో మండపాన్ని అలంకరించుకోవాలి. సమంత్ర పూర్వకంగా అమ్మవారిని ప్రతిష్టించుకోవాలి. అనంతరం కలశంలో గంగాజలం, పూలు, అక్షింతలు వేసి మామిడి ఆకులతో అలంకరించి పైన కొబ్బరికాయను ఉంచి, దానిపై ఎరుపు రంగు జాకెట్ ముక్కను ఉంచి కలశం సిద్ధం చేసుకోవాలి. ఈ కలశాన్ని మన శక్తికి తగినట్లుగా రకరకాల ఆభరణాలతో అలంకరించుకోవచ్చు. ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత కలశానికి ముందు వైపుగా అమ్మవారి చిత్ర పటాన్ని లేదా విగ్రహాన్ని పెట్టాలి. అన్నిటికంటే ముందుగా అమ్మవారి మహా నైవేద్యానికి కావలసిన పదార్ధాలను తయారు చేసి సిద్ధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు పూజను ప్రారంభించుకోవాలి.

ముందుగా దీపారాధన చేసుకోవాలి. అనంతరం తమలపాకులో పసుపుతో గణపతిని తయారు చేసి షోడశోపచారాలతో పూజించాలి. అరటి పండ్లు, బెల్లం వినాయకుని నైవేద్యంగా సమర్పించాలి. సిద్ధం చేసుకున్న కలశంలోకి సమస్త నదీ జలాలను ఆవాహన చేస్తూ కలశపూజ చేయాలి. అనంతరం శ్రీ మహాలక్ష్మీదేవి మంత్రపూర్వకంగా ఆవాహన చేసి, షోడశోపచారాలు చేయాలి. నూలు దారానికి పసుపు పూసి పువ్వులతో అమర్చి తయారు చేసిన తోరాలను అమ్మవారి ముందు ఉంచి అక్షింతలతో పూజించాలి.

అనంతరం కలువ, గులాబీ పువ్వులు అక్షింతలు వేస్తూ శ్రీలక్ష్మీదేవి అష్టోత్తర శత నామాలు చదువుకోవాలి. అనంతరం కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకోవాలి. అమ్మవారికి పులిహోర, గారెలు, బూరెలు, పరమాన్నం, వడపప్పు, పానకం, శనగలు, చలిమిడి వంటి సంప్రదాయ ప్రసాదాలను నివేదించాలి. కర్పూర నీరాజనం ఇచ్చి మంగళ హారతులు ఇవ్వాలి. తరువాత అమ్మవారిని తొలి ముత్తైదువగా భావించి చీర, జాకెట్టు, తోరం, పసుపు కుంకుమలతో వాయనం ఇవ్వాలి.

పూజ పూర్తయ్యాక భక్తిశ్రద్ధలతో తోరాలను కట్టుకొని వ్రత కథను చదువుకుని అక్షింతలు వేసుకోవాలి. ఇప్పుడు ముత్తైదువులకు యధాశక్తి తాంబూలాలు, వాయనాలు ఇవ్వాలి. పెద్ద ముత్తైదువులకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి. శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేయడం మహిళలకు అత్యంత శుభప్రదం. ఎవరైతే శాస్త్రోక్తంగా వరలక్ష్మీదేవి వ్రతాన్ని ప్రతి ఏడాది ఆచరిస్తారో ఆ ఇంట సిరి సంపదలకు లోటుండదు. భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించినవారు అమ్మవారి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో జీవిస్తారని విశ్వాసం. ఎవరికైనా శ్రావణమాసం రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేసుకోవడానికి వీలుకాకపోతే శ్రావణ మాసంలోని ఏ శుక్రవారంలోనైనా వరలక్ష్మీ వ్రతం చేసుకోవచ్చు.

శుభ సమయం..

సింహ లగ్న పూజ ముహూర్తం ఉదయం 5. 57 గంట నుంచి 8. 14 గంటల వరకు ఉంది.

వృశ్చిక రాశి పూజ ముహూర్తం మధ్యాహ్నం 12. 50 గంటల నుంచి 3. 08 గంటల వరకు ఉంది.

కుంభ లగ్న పూజ ముహూర్తం సాయంత్రం 6.55 గంటలకు ప్రారంభమవుతుంది. రాత్రి 8.22 వరకు ఉంది.

వృషభ లగ్న పూజ ముహూర్తం అర్ధరాత్రి 11. 22 గంటల నుంచి తెల్లవారు జాము 1. 18 గంటల వరకు ఉంది.