Prediabetes Symptoms: షుగర్ వ్యాధిని ముందే గుర్తించడం ఎలా, మధుమేహం వచ్చే ముందు కలిగే లక్షణాలు గురించి తెలుసుకోండి, చక్కెర వ్యాధికి గల కారణాలు, మానుకోవలసిన అలవాట్లు, జాగ్రత్తలు ఓ సారి చూద్దామా..
ఈ దీర్ఘకాలిక వ్యాధి (Prediabetes) బారిన ప్రపంచంలో చాలామంది పడుతున్నారు. మనదేశంలో అయితే షుగర్ బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతుందే కాని తగ్గడం లేదు.
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న వ్యాధి ఏదైనా ఉందంటే అది చక్కెర వ్యాధి. ఈ దీర్ఘకాలిక వ్యాధి (Prediabetes) బారిన ప్రపంచంలో చాలామంది పడుతున్నారు. మనదేశంలో అయితే షుగర్ బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతుందే కాని తగ్గడం లేదు. మధుమేహం లేదా చక్కెర వ్యాధిని వైద్య పరిభాషలో డయాబెటిస్ మెల్లిటస్ అని వ్యవహరిస్తారు. డయాబెటిస్ అని కూడా పిలుస్తారు, ఇన్స్యులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం, రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయి వంటి లక్షణాలతో కూడిన ఒక రుగ్మతగా దీన్ని చెప్పుకోవచ్చు.
అతిమూత్రం (పాలీయూరియా), దాహం ఎక్కువగా వేయడం (పాలీడిప్సియా), మందగించిన చూపు, కారణం లేకుండా బరువు తగ్గడం, బద్ధకం దీని ముఖ్య లక్షణాలుగా (Prediabetes Symptoms) ఉంటాయి. మధుమేహం లేదా చక్కెర వ్యాధిని సాధారణంగా రక్తంలో మితి మీరిన చక్కెర స్థాయిని బట్టి గుర్తిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం భారత దేశం, చైనా, అమెరికా సంయుక్త రాష్ట్రాలలో అత్యధికంగా ఈ వ్యాధి ప్రబలుతూ ఉంది. ఈ వ్యాధిని (Borderline Diabetes) పూర్తిగా తగ్గించే మందులు లేవు. జీవితాంతం తగిన జాగ్రత్తలు తీసుకొన్నట్లయితే దీన్ని అదుపులో ఉంచుకోవడం సాధ్యమవుతుంది.
డయాబెటిస్ రాబోయే ముందు కనిపించే లక్షణాలను ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటారు. ఈ దశలో కొందరికి జట్టు రాలుతుంది. మరికొందరికి రోజంతా అలసటగా ఉంటుంది. ఏం పని చేయకపోయినా కూడా అలసటగా అనిపిస్తుంది. ఇంకొందరికి చర్మంపై మచ్చలు వస్తుంటాయి. కొందరిలో తరచూ మూత్ర విసర్జన అవుతూ ఉంటుంది. కొంతమందిలో వీటికి అదనంగా తలనొప్పి, చేతులు కాళ్లు తిమ్మిర్లు పట్టడం లాంటి లక్షణాలు కూడా డయాబెటిస్‌కు సంకేతాలుగా ఉంటాయి. పై లక్షణాల్లో ఏది కనిపించినా వెంటనే షుగర్ చెకప్ చేయించుకోవడం ఉత్తమం.
ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన రెండు డయాబెటిస్ మెల్లిటస్ రకాలు: వివిధ రకాల కారణాల వల్ల కలిగే డయాబెటిస్ మెల్లిటస్ టైప్ 1. డయాబెటిస్ మెల్లిటస్ టైప్ 2, జెస్టేషనల్ డయాబెటిస్ (గర్భిణీలలో వచ్చే డయాబెటిస్) అయినా, అన్ని రకాల మధుమేహాలకు మూల కారణం క్లోమ గ్రంధిలోని బీటా కణాలు పెరిగిన గ్లూకోస్ స్థాయిని అరికట్టడానికి సరిపడినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేకపోవడమే. మొదటి రకం డయాబెటిస్ సాధారణంగా బీటా కణాలను మన శరీరం స్వయంగా నాశనం చేయడం (ఆటోఇమ్యూనిటీ) వల్ల కలుగుతుంది. రెండవ రకం డయాబెటిస్‌లో ఇన్సులిన్ నిరోధకత వస్తుంది. దీనివల్ల అధికంగా ఇన్సులిన్ కావలసి వస్తుంది, బీటా కణాలు ఈ డిమాండ్ తట్టుకోలేనప్పుడు డయాబెటిస్ కలుగుతుంది. జెస్టేషనల్ డయాబెటిస్‌లో కూడా ఇన్సులిన్ నిరోధకత అగుపిస్తుంది.
డయాబెటిస్ వల్ల అనేక కాంప్లికేషన్స్ వస్తాయి. త్వరగా, తీవ్రంగా (అక్యూట్) వచ్చే కాంప్లికేషన్స్ హైపోగ్లైసీమియా, కీటో అసిడోసిస్ లేదా నాన్‌కీటోటిక్ హైపర్‌ఆస్మొలార్ కోమా వ్యాధిని సరిగా నియంత్రించుకోకపోతే రావచ్చు. తీవ్రమైన దీర్ఘకాలిక కాంప్లికేషన్స్‌గా హృద్రోగాలు (రెట్టింపు ఆపద), దీర్ఘకాలిక మూత్రపిండాల బలహీనత, డయాబెటిక్ రెటినోపతి (రెటీనా చెడిపోవడం తద్వారా అంధత్వము కలుగుతుంది), డయాబెటిక్ న్యూరోపతి (చాలా రకాలైన నాడీ కణాలు చెడిపోవడం), సూక్షనాళికలు చెడిపోవడం వల్ల కలిగే పురుషత్వ లోపం, గాయాలు త్వరగా మానకపోవడం ముఖ్యమైనవి. గాయాలు సరిగా మానకపోవడం వల్ల ముఖ్యంగా కాళ్ళలో గాంగ్రీన్ రావడం వల్ల ఒక్కోసారి అవిటితనం కూడా రావచ్చు. డయాబెటిస్‌పై సరైన నియంత్రణ, రక్తపోటును అదుపులో ఉంచుకోవడం, దైనందిన విషయాలలో మార్పులు చేసుకోవడం వల్ల (సిగరెట్లు మానివేయడం లాంటివి), ఆరోగ్యకరమైన బరువును నిలుపుకోవడం చేస్తే పైన చెప్పబడిన చాలా వరకు కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
వ్యాధికి గల కారణాలు
వంశపారంపర్యంగా మధుమేహం వచ్చే అవకాశం ఉంది. శారీరక శ్రమ పూర్తిగా లోపించడం, గంటల తరబడి కూర్చోని ఉండటం, పోషకపదార్థాలు సరిగా లేని ఆహారం, వేపుడు కూరలు, అధికంగా కొవ్వు ఉండే పదార్థాలు, మాంసాహారం, బేకరీ పదార్థాలు, నిల్వఉండే పచ్చళ్లు, తీపి పదార్థాలు, కొన్ని రకాల మందుల దుష్ఫరిణామాలు ఈ వ్యాధికి కారణం. స్టెరాయిడ్స్, కొన్ని రకాల వైరస్, ఇన్ఫెక్షన్స్, హార్మోన్ల అసమతుల్యత వల్ల మధుమేహం వస్తుంటుంది.
మధుమేహం రకాలు
టైప్ 1 మధుమేహం: కొందరిలో అసలు ఇన్సులిన్ ఉత్పత్తి జరగదు. వీరికి బయట నుంచి ఇన్సులిన్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని టైప్ 1 డయాబెటిస్ అంటారు. ఇది చిన్న పిల్లల్లో వచ్చే అవకాశం ఉంది.
టైప్ 2 మధుమేహం: వివిధ కారణాల వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి తగినంత కాదు. పాంక్రియాస్, ఇన్ఫెక్షన్స్ వల్లగాని, ఆహార నియమాలు సరిగా లేకపోవడం చేత, క్రమంగా ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గుతుంది. గెస్టెషనల్ డయాబెటిస్: గర్భవతుల్లో 2 నుంచి 5 శాతం వరకు ఈ డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. ఈ డయాబెటిస్‌కు సరిగా వైద్యం అందించకపోతే తల్లీ, బిడ్డలకు ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. కొన్నిసార్లు ప్రసవం తర్వాత డయాబెటిస్ ఉండవచ్చు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
చక్కెరవ్యాధిగ్రస్తులు ఆ జబ్బు గురించి అవగాహన పెంచుకోవాలి. ఇతర రోగులతో కలిసి తమకు తెలిసిన విషయాలను మిగిలిన వారితో పంచుకోవాలి. పాదాలు, మూత్ర పిండాలు, గుండె, నరాలు మొదలైన అవయవాలపై ఈ వ్యాధి ప్రభావం ఎలా ఉంటుందో వీరు తెలుసుకోవాలి. రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. తద్వారా శరీరం బరువు పెరగకుండా చూసుకోవాలి.
భోజనానికి అరగంట ముందు మాత్రలు వేసుకోవాలి. మాత్రలు వేసుకోవడం మాత్రమే కాదు. వాటిని ప్రతిరోజూ సరియైన సమయంలోనే వేసుకోవాలి. సమయ పాలన లేకపోతే మందులు వేసుకుంటున్నా శరీరంలో ఒక అపసవ్య స్థితి ఏర్పడుతుంది.
ప్రతి రోజూ ఒక నిర్ణీత సమయంలోనే భోజనం చేయాలి.
ఇన్సులిన్ వేసుకోవడంలోనూ కాల నియమాన్ని పాటించాలి.
మధుమేహంలో కాళ్లల్లో స్పర్శజ్ఞానం పోయిందన్న విషయం చాలాకాలం వరకు తెలియదు. అందుకే వారు ఏటా ఒకసారి పాదాల్లో స్పర్శ ఎలా ఉందో తెలుసుకోవాలి. స్పర్శ లేకపోతే ప్రతి ఆరుమాసాలకు వీలైతే మూడు మాసాలకు ఒకసారి పరీక్ష చేయించాలి.
పాదాల మీద చర్మం కందిపోవడం, గాయాలు, పుండ్లు, ఆనెలు ఏమైనా ఉన్నాయేమో గమనించాలి. డాక్టర్ సమక్షంలో అవసరమైన చికిత్స తీసుకోవాలి.
గోళ్లు తీసే సమయంలో ఎక్కడా గాయం కాకుండా జాగ్రత్త వహించాలి. పాదాలను ప్రతి రోజూ గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయాలి.
ఇన్‌ఫెక్షన్లతో కాళ్లకు చీము పడితే చాలా తీవ్రమైన విషయంగా పరిగణించాలి. డాక్టర్ సలహాతో యాంటీబయాటిక్స్, అవసరమైతే ఇన్సులిన్ తీసుకోవాలి.
అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ పరీక్షలు, అలాగే కళ్లు, కిడ్నీ పరీక్షలు కూడా డాక్టర్ సలహా మేరకు చేయించుకోవాలి.
మధుమేహం ఉన్న వారికి మూత్ర పిండాలు దెబ్బతినే అవకాశం ఉంది. దీనివల్ల మూత్రంలో ఆల్బుమిన్ అనే ప్రొటీన్ విసర్జించబడుతుంది. అంతిమంగా ఇది కిడ్నీ దెబ్బ తినడానికి దారి తీస్తుంది. అందుకే ప్రతి మూడు మాసాలకు, ఆరు మాసాలకు పరీక్ష చేసి మూత్రంలో ఆల్బుమిన్ ఉందా లేదా కనుగొనాలి.
మధుమేహం ఉన్న వారిలో గుండె కండరాలకు రక్తాన్ని కొనిపోయే కరొనరీ రక్తనాళాలు మూసుకుపోయే ప్రమాదం ఉంది. అందుకే గుండె నొప్పి ఉన్నా లేకపోయినా ప్రతి ఏటా ఇసిజి, ట్రెడ్‌మిల్ పరీక్షలు చేయించుకోవడం అవసరం. అలాగే కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తెలిపే లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు చేయించాలి.
ధాన్యాలు, పిండిపదార్థాలు తగ్గించి పీచు పదార్థాలు అధికంగా ఉండే కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.
రక్తంలో త్వరగా కరిగిపోయే పీచుపదార్థాలను కలిగి సోడియం కొలెస్టృఆలు లేని జామపండు మధుమేహ వ్యాధిగ్రస్థులు తినతగిన పండ్లలో ఒకటి.మధుమేహాన్ని నియంత్రిస్థుందని ఆధునిక విజ్ఞానం వివరిస్తుంది.
మానుకోవలసిన అలవాట్లు
తీపి పదార్థాలు, ఐస్‌క్రీములు మానుకోవాలి. అతి పరిమితంగా తీసుకున్నప్పుడు అయితే, ఆరోజు మామూలుగా తీసుకునే ఆహార పదార్థాల మోతాదును బాగా తగ్గించాలి. అలాగే నూనె పదార్థాలు కూడా బాగా తగ్గించాలి.
కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో శరీరంలో చక్కెర శాతం హఠాత్తుగా పెరిగిపోవచ్చు. అప్పుడు మాత్రలు ఆ స్థితిని అదుపు చేయలేకపోవచ్చు. అలాంటప్పుడు డాక్టర్ సూచిస్తే ఇన్సులిన్ తీసుకోవాలి. ఆ తరువాత చక్కెర అదుపులోకి వచ్చాక మళ్లీ మాత్రలకే పరిమితం కావచ్చు. ఒకసారి ఇన్సులిన్ తీసుకుంటే జీవితాంతం ఇన్సులిన్ తీసుకోవలసి వస్తుందన్నది సరికాదు. ఆ కారణంగా ఇన్సులిన్ తీసుకోవడానికి వెనుకాడకూడదు.
పాదరక్షలు లేకుండా నడవకూడదు.
పొగతాగడం పూర్తిగా మానుకోవాలి.
మానసిక ఒత్తిళ్లను తగ్గించుకోవాలి.
కొలెస్ట్రాల్ అధికంగా ఉండే కొవ్వు ఉన్న మాంసం, గుడ్లు తినడం మానుకోవాలి.