Covid-19: షాకింగ్ వాస్తవాలు, కరోనా సోకిన వారిని వెంటాడుతున్న లాంగ్ కోవిడ్ లక్షణాలు, శ్వాసకోస సమస్యలు,నీరసం,రుచి,వాసన శక్తి తగ్గిపోవడం వంటివి కొనసాగుతున్నాయని అధ్యయనంలో వెల్లడి

కరోనా లక్షణాలు బయటికి పెద్దగా కనిపించకపోయినా శరీరం మాత్రం బలహీనం అవుతోందని, లాంగ్ కోవిడ్ లక్షణాలు చాలా కాలం కొనసాగుతున్నాయని (long coronavirus symptom) నెదర్లాండ్స్ కు చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Coronavirus Outbreak Representational Image| (Photo Credits: PTI)

రెండున్నరేళ్ల నుంచి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా మహమ్మారి మళ్లీ మెల్లిగా పుంజుకుంటోంది. చాలామందికి కరోనా వచ్చి వెళ్ళిపోయింది. అయితే వారిలో కరోనా లక్షణాలు బయటికి పెద్దగా కనిపించకపోయినా శరీరం మాత్రం బలహీనం అవుతోందని, లాంగ్ కోవిడ్ లక్షణాలు చాలా కాలం కొనసాగుతున్నాయని (long coronavirus symptom) నెదర్లాండ్స్ కు చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కరోనావైరస్ బారిన పడిన ప్రతి 8 మందిలో ఒకరిలో (One in eight adults) ఈ వ్యాధి దీర్ఘకాలిక ప్రభావం చూపుతోందని.. శ్వాసకోస సమస్యలు, నీరసం, రుచి, వాసన శక్తి తగ్గిపోవడం లక్షణాల్లో.. కనీసం ఒకట్రెండు లక్షణాలు చాలాకాలం కొనసాగుతున్నాయని (develops long coronavirus symptoms) అంటున్నారు. లాన్సెట్ జర్నల్ లో ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలు ప్రచురితమయ్యాయి.

దేశంలో కొత్తగా 16,167 కరోనా కేసులు, ఇప్పటివరకు 5,26,730 మంది మృతి, మరో 1,35,510 కేసులు యాక్టివ్‌

రెండేళ్లకుపైగా సుదీర్ఘ అధ్యయనం చేసిన ఈ నివేదికలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. 2020 మార్చి 20 నుంచి 2021 ఆగస్టు వరకు నెదర్లాండ్స్‌ దేశంలో 76,422 మంది కరోనా బాధితులకు సంబంధించిన వివరాలను తీసుకున్నారు. వారిలో కరోనాకు సంబంధించిన 23 రకాల లక్షణాలను సుదీర్ఘకాలం పరిశీలించారు.రెండేళ్లకుపైగా సమయంలో 24 సార్లు వారి ఆరోగ్యాన్ని పరిశీలించి, పలు వివరాలను సేకరించారు. ఈ క్రమంలోనే ప్రతి ఎనిమిది మందిలో ఒకరు లాంగ్ కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.

21 శాతం మంది తమకు కరోనా నిర్ధారణ అయిన మొదటి ఐదు నెలల పాటు ఒక్కటి, అంతకంటే ఎక్కువ లక్షణాలతో ఇబ్బందిపడినట్టు అధ్యయనంలో వెల్లడించారు.

అయితే ఇలాంటి వారి నుంచి ఇతరులకు కరోనా వైరస్‌ సోకడం లేదని తేలిందని.. వారిలో వైరల్ లోడ్ తక్కువగా ఉండటమే దీనికి కారణమై ఉంటుందని భావిస్తున్నామని పరిశోధకులు తెలిపారు.లాంగ్ కోవిడ్ గురించి ఇప్పటికే తెలిసినా.. దానికి కారణాలపై మరింత లోతుగా పరిశీలన జరిపాల్సిన అవసరం ఉందని పరిశోధనకు నేతృత్వం వహించిన గ్రొనింజెన్‌ వర్సిటీ శాస్త్రవేత్త జుడిత్‌ రొస్ మిలెన్‌ పేర్కొన్నారు