Omicron Covid Variant: ఒమిక్రాన్ వైరస్ లక్షణాలు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒమిక్రాన్ కరోనా వేరియంట్ పై ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రపంచదేశాలు, మళ్లీ మాస్కులు ధరించాలని సూచన
కొత్త వైరస్ స్పైక్ ప్రోటీన్ ప్రాంతంలో 30కిపైగా మ్యుటేషన్లు ఉన్నాయని తెలిపారు. ఈ మ్యుటేషన్లు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందన్నారు.
కొవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (B.1.1.529) వేరియంట్‌పై ఢిల్లీకి చెందిన ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా ఆదివారం ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త వైరస్ స్పైక్ ప్రోటీన్ ప్రాంతంలో 30కిపైగా మ్యుటేషన్లు ఉన్నాయని తెలిపారు. ఈ మ్యుటేషన్లు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందన్నారు. స్పైక్ ప్రోటీన్లు దేహంలోకి వైరస్ ప్రవేశాన్ని సులభతరం చేస్తాయని, అలాగే ఇన్ఫెక్షన్ కలిగిస్తాయన్నారు. మార్పులతో రోగ నిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకుంటుందన్నారు. స్పైక్ ప్రోటీన్ శక్తిని తగ్గించేందుకు టీకాలో యాంటీబాడీలు ఉత్పత్తవుతాయన్నారు. స్పైక్ ప్రొటీన్లలో ముట్యేషన్లు పెరిగితే టీకా సామర్థ్యం తగ్గుతుందన్న ఎయిమ్స్ ఛీప్.. ఒమిక్రాన్‌పై ప్రస్తుత వ్యాక్సిన్ల సామర్థ్యం పరిశీలించాల్సి ఉందన్నారు.
దక్షిణాఫ్రికా నుంచి మహారాష్ట్రలోని థానేకు (Thane) వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అతడిని ఐసోలేషన్‌లో ఉంచారు. థానే జిల్లాలోని దొంబివ్లీ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఈనెల 24న దక్షిణాఫ్రికా నుంచి ఢిల్లీకి వచ్చాడు. అటునుంచి ముంబైకి చేరుకున్నాడు. అతనికి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అతని నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించామని వైద్యులు తెలిపారు.
అతని కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు చేశామని.. సోదరునికి మినహా మిగిలిన అందరికీ పాజిటివ్ వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం వారంతా ఐసోలేషన్‌లో ఉన్నారన్నారు. ఆదివారం దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరు వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు కూడా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే అది ఒమిక్రాన్ కాదని, డెల్టా స్ట్రెయిన్ అని పరీక్షల్లో నిర్ధారణ అయిందని వైద్యులు తెలిపారు.
కరోనా వైరస్ (Coronavrius) నుంచి తాజాగా రూపాంతరం చెందిన ఒమిక్రాన్ వైరస్ (Omicron Covid Variant) ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దక్షిణాఫ్రికాలో ఈ వైరస్ ను తొలుత గుర్తించారు. ఆ తర్వాత పలు ఆఫ్రికా దేశాలతో పాటు ఆస్ట్రేలియా, ఇటలీ, జర్మనీ, నెదర్లాండ్స్, బ్రిటన్, ఇజ్రాయల్, హాంకాంగ్, బోట్స్ వానా, బెల్జియం తదితర దేశాల్లో కూడా ఈ వేరియంట్ ను గుర్తించారు. తాజాగా భారత్ లో కూడా ఈ వైరస్ ప్రవేశించింది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తిలో ఒమిక్రాన్ ను గుర్తించారు. ఈ వైరస్ ( Omicron Variant) మన దేశంలో కూడా ప్రవేశించిన నేపథ్యంలో... అందరూ మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
ఒమిక్రాన్ లక్షణాలు ఎలా ఉంటాయి.
ఒమిక్రాన్ వైరస్ బారిన పడినవారిలో తొలుత అలసటగా ఉంటుంది. ఒంటి నొప్పులు, గొంతులో కొద్దిగా గరగరగా ఉండటం, పొడి దగ్గు, కొద్ది పాటి జ్వరం కూడా ఉంటుంది. చాలా మటుకు చికెన్ గున్యా లక్షణాలే ఉంటాయి. కరోనా తొలి వేవ్ లో వైరస్ బారిన పడిన వారికి కూడా ఒమిక్రాన్ సోకవచ్చు. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారికి కూడా వైరస్ సోకే అవకాశం ఉంది. సెకండ్ వేవ్ లో కరోనా బారిన పడిన వారికి ఈ వైరస్ సోకే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. వైరస్ సోకినా చాలా మందికి తెలియకుండానే పోతుంది.
అయితే వైరస్ బారిన పడిన వారు ధైర్యంగా ఉండాలి. భయపడితే వారి పాలిట ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. ఒమిక్రాన్ డెల్డా వేరియంట్ కంటే వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో అందరం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. శారీరక వ్యాయామం, డీ విటమిన్ కోసం ఎండలో నడవడం చేయాలి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. ఆహారంలో ప్రొటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. శాఖాహారులు విటమిన్ బీ12 తీసుకోవాలి.