Omicron Variant: ఈ లక్షణాలు ఉంటే వారు ఒమిక్రాన్ వ్యాధి బారీన పడినట్లే.. రాత్రి వేళల్లో తీవ్రమైన చెమట పట్టడం, తీవ్రమైన ఒళ్లు నొప్పులు ప్రధాన లక్షణాలు అని చెబుతున్న సౌతాఫ్రికా డాక్టర్ ఉన్‌బెన్ పిల్లే
అయితే డెల్టా రకంతో పోలిస్తే దీని లక్షణాలు భిన్నంగా ఉన్నాయని భయపడాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఈ వేరియంట్ (Omicron variant) ఇప్పటికే 60కు పైగా దేశాలలో విస్తరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం దీనిని ఆందోళనకరమైన వేరియంట్‌గా గుర్తించింది. భారత్ లో కూడా ఈ వేరియంట్ కేసులు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ తీవ్రత, లక్షణాలపై డాక్టర్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఒమిక్రాన్ డెల్టా వేరియంట్ కంటే మరీ అంత ప్రమాదకరమైంది కాదని (Omicron is Milder Than Delta variant) చెబుతున్నారు. కాలక్రమంలో ఎలా రూపాంతరం చెందుతుందో చెప్పడం కష్టమని, అయితే సరైన జాగ్రత్తలు పాటిస్తే సురక్షితంగా బయటపడవచ్చని పేర్కొంటున్నారు.
సార్స్-కోవ్-2 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాలా తొందరగా ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి వ్యాపిస్తుందని డబ్ల్యూహెచ్‌ఓ చెబుతోంది. అయితే డెల్టా రకంతో పోలిస్తే దీని లక్షణాలు భిన్నంగా ఉన్నాయని భయపడాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. సౌతాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియంట్‌ను తొలిసారి గుర్తించిన ఆ దేశ మెడికల్ అసోసియేషన్ చైర్‌పర్సన్ డాక్టర్ ఏంజెలిక్ కోట్జే సైతం దీని తీవ్రత తక్కువగానే ఉన్నట్లు పేర్కొన్నారు.
తాజాగా దక్షిణాఫ్రికా హెల్త్ డిపార్టుమెంటుకు చెందిన డాక్టర్ ఉన్‌బెన్ పిల్లే (South African Doctors Dr Unben Pillay) ఈవేరియంట్ మీద మాట్లాడుతూ ఒమిక్రాన్ రాత్రి వేళల్లో చురుగ్గా ఉంటుందని, తీవ్రమైన ఒళ్లు నొప్పులు, రాత్రుళ్లు బాగా చెమట పట్టడం ఎక్కువగా జరుగుతుందని తెలిపారు. మరి కొంత మందిలో.. తీవ్రమైన తలనొప్పి, స్వల్ప జ్వరం, అలసట, గొంతులో దురద వంటి లక్షణాలు కూడా కనిపించాయని సౌత్ ఆఫ్రికాకు చెందిన మరో డాక్టర్ తెలిపారు. తాను కూడా బాధితులకు రాత్రి వేళల్లో తీవ్రమైన చెమట పట్టడం గమనించానని, దుస్తులు కూడా తడిసిపోతున్నట్లు చెప్పారు. అయితే వాసన కోల్పోవడం, ముక్కు కారడం వంటి లక్షణాలు మాత్రం ఒమిక్రాన్ బాధితుల్లో కనిపించడం లేదన్నారు.
ఒమిక్రాన్ వేరియంట్ ప్రధాన లక్షణాలు
►స్వల్ప జ్వరం
►తీవ్రమైన ఒళ్లు నొప్పులు
►అలసట
►రాత్రుళ్లు విపరీతంగా చెమటపట్టడం
►గొంతులో జీర వంటివి ఒమిక్రాన్ ప్రధాన లక్షణాలుగా వైద్యులు పేర్కొంటున్నారు.
అందరూ జాగ్రత్తలు పాటించాల్సిందే
అంతేగాక కోవిడ్ లక్షణాలైన పొడిదగ్గు, శ్వాసకోశ సమస్యలు, రక్తంలోని ఆక్సీజన్ లెవల్స్ పడిపోవడం వంటివి జరిగితే వెంటనే పరీక్షలు చేయించుకుని జాగ్రత్త పడాల్సిందిగా సూచిస్తున్నారు. అదే విధంగా తరచుగా శానిటైజర్‌తో చేతులు శుభ్రపరచుకోవడం, మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తప్పక పాటించాలని సూచిస్తున్నారు. కచ్చితంగా వ్యాక్సిన్ రెండు డోసులు, బూస్టర్ డోసులు వేయించుకోవాలని చెబుతున్నారు. రోగ నిరోధక శక్తి పెంపొందించే ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు.