Obesity: అధిక బరువుతో బాధపడే వారి సంఖ్య 100 కోట్లకు పై మాటే, షాకింగ్ విషయాలను వెల్లడించిన ది లాన్సెంట్ జర్నల్ అధ్యయనం
వీరిలో పెద్దలేగాక, పిల్లలు, యువకులూ ఉన్నారని ‘ది లాన్సెంట్ జర్నల్’ కథనం పేర్కొంది. 1990 నుంచి తక్కువ బరువుతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతోందని ఈ అధ్యయనం తెలిపింది
ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం (Obesity)తో బాధపడేవారి సంఖ్య ఏకంగా 100 కోట్లు దాటిందని తాజా అధ్యయనం వెల్లడించింది. వీరిలో పెద్దలేగాక, పిల్లలు, యువకులూ ఉన్నారని ‘ది లాన్సెంట్ జర్నల్’ కథనం పేర్కొంది. 1990 నుంచి తక్కువ బరువుతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతోందని ఈ అధ్యయనం తెలిపింది. 2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మందికి పైగా అధిక బరువుతో బాధపడుతుండగా వీరిలో 15.9 కోట్ల మంది చిన్నారులతో పాటు యువకులు ఉండగా, 87.9 కోట్ల మంది పెద్దలు ఉన్నట్లు లాన్సెంట్ తెలిపింది. 1990 నాటితో పోలిస్తే నాలుగురెట్లు పెరిగిందని అధ్యయనం తెలిపింది.
ఎన్‌సీడీ రిస్క్ ఫ్యాక్టర్ కొలాబరేషన్ (NCD-RisC), ప్రపంచ ఆరోగ్య సంస్థ వద్ద అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా లాన్సెంట్ ఈ అధ్యయనం నిర్వహించింది. పెద్ద వయసు మహిళల్లో ఊబకాయం రెండింతలు, పురుషులలో దాదాపు 3 రెట్లు పెరిగిందని పేర్కొంది.త్వరితగతిన చర్యలు తీసుకోకుంటే 2035 నాటికి ప్రపంచ జనాభాలో సగానికి పైగా అధిక బరువుతో బాధపడతారని వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ (World Obesity Federation) ఇప్పటికే హెచ్చరించింది.