Haj Yatra 2022: హజ్ యాత్ర–2022 షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర హజ్ కమిటీ, జూన్ 17నుంచి జూలై 3వరకు యాత్ర, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 3,500 మంది యాత్రికులు
తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ ఏడాది 1,822 మందికి హజ్ యాత్రకు (Haj Yatra 2022)వెళ్లే అవకాశం దక్కిందని, టీకా రెండు డోసులు తీసుకున్న వారినే ఎంపిక చేసినట్లు రాష్ట్ర హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ అధికారి బి. షఫీవుల్లా తెలిపారు
హజ్ యాత్ర–2022కు కేంద్ర హజ్ కమిటీ షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ ఏడాది 1,822 మందికి హజ్ యాత్రకు (Haj Yatra 2022)వెళ్లే అవకాశం దక్కిందని, టీకా రెండు డోసులు తీసుకున్న వారినే ఎంపిక చేసినట్లు రాష్ట్ర హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ అధికారి బి. షఫీవుల్లా తెలిపారు. కరోనా వల్ల ఈ ఏడాది యాత్రకు 65 ఏళ్లలోపు వారికే కేంద్ర హజ్ కమిటీ షరతులతో కూడిన అనుమతినిచ్చిందని పేర్కొన్నారు. జూన్ 17నుంచి జూలై 3వరకు యాత్ర ఉంటుందన్నారు.
ఇప్పటికే ఎంపికైన యాత్రికుల నుంచి మొదటి వాయిదాగా రూ.2.1లక్షలు వసూలు చేశామని, కేంద్ర హజ్ కమిటీ ఆదేశాలతో రెండో వాయిదా వసూలు చేస్తామని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 3,500 మంది యాత్రికులుంటారని, ఈ ఏడాది రెండు రాష్ట్రాలవారూ హైదరాబాద్ ఎంబారికేషన్ పాయింట్ నుంచే వెళ్లనున్నారని చెప్పారు. హజ్ యాత్రికులను తీసుకెళ్లే అవకాశం ఈసారి సౌదీ ఎయిర్‌లైన్స్‌కు లభించిందని, ఎంపికైన యాత్రికులకు హజ్ శిక్షణ శిబిరాలు కొనసాగుతున్నాయని వివరించారు.