TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్, జనవరి నెల ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేసిన టీటీడీ, తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
జనవరి నెల కోటాకు సంబంధించి ఆర్జిత సేవా టికెట్లను సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. జనవరి నెల మొత్తానికి సంబంధించిన టికెట్లను భక్తులు ఆన్ లైన్ ద్వారా బుక్‌చేసుకోచ్చు.
Tirumala, Dec 12: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆర్జిత సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నేడు విడుదల చేసింది. జనవరి నెల కోటాకు సంబంధించి ఆర్జిత సేవా టికెట్లను సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. జనవరి నెల మొత్తానికి సంబంధించిన టికెట్లను భక్తులు ఆన్ లైన్ ద్వారా బుక్‌చేసుకోచ్చు. అదేవిధంగా ఈ నెల 16, 31వ తేదీదీలకు సంబంధించి ప్రత్యేక రూ.300 దర్శనం టైం స్లాట్ టోకెన్లను మంగళవారం విడుదల చేయనుంది.
రేపు ఉదయం 9 గంటలకు ఈ టికెట్లను అందుబాటులో ఉంచనుంది.కాగా, ఈనెల 16 సాయంత్రం నుంచి ధనుర్మాస నెల ప్రారంభమవుతుంది. దీంతో 17వ తేదీ నుంచి జనవరి 14 వరకు సుప్రభాత సేవలను టీటీడీ రద్దు చేసింది.
అదేవిధంగా, 2023 జనవరి నెలకు సంబంధించి మరికొన్ని ఆర్జితసేవా టికెట్లకు ఆన్‌లైన్ లక్కీడిప్ నమోదు ప్రక్రియ ద్వారా అదేరోజు ఉదయం 10 గంటల నుంచి డిసెంబరు 14న ఉదయం 10 గంటల వరకు కొనసాగుతుంది. ఆ తరువాత లక్కీడిప్‌లో టికెట్లు కేటాయిస్తారు. భక్తులు ఈ విషయాలను గుర్తించి శ్రీవారి ఆర్జిత సేవలను బుక్ చేసుకోవాలని టీటీడీ బోర్డు విజ్ఞప్తి చేసింది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం తిరుమల శ్రీవారిని 72,466 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.29 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 28,123 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.