Wedding Called-off: వరుడు తాళి కట్టే సమయానికి మంటపంలో ప్రియుడు ప్రత్యక్షం, అర్ధాంతరంగా నిలిచిపోయిన లగ్గం, నివ్వెరపోయిన సమస్త బంధుగణం

ఇంతదాకా రాకముందే ఆమె చెప్పాల్సి ఉండేదని అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల వరుడుకి నిరాశ, ఇరుపక్షాలకు నష్టం కలిగిందని చెబుతున్నారు.

Image used for representation purpose only | Photo: Wikimedia Commons

మనం తెలుగు సినిమాల్లో చాలా సార్లు ఈ సీన్ చూసుంటాం. వధువుకి తన ప్రియుడితో కాకుండా వేరే వ్యక్తితో పెళ్లి జరుగుతూ ఉంటుంది. అన్ని సవ్యంగా జరిగిపోతున్నాయి అనుకుంటుండగా, పెళ్లికూతురు మెడలో పెళ్లికొడుకు తాళి కట్టబోతుండగా "ఆపండీ" అంటూ ఎవరో ఒకరు వచ్చి డైలాగ్ కొడతారు. దీంతో అందరూ అవాక్కవుతారు, పెళ్లి తంతు అక్కడే నిలిచిపోతుంది. సరిగ్గా అలాంటి సంఘటనే ఇటీవల తెలంగాణలో చోటు చేసుకుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ "ఆపండీ" అనే డైలాగ్ ఎవరో ఒకరు కాకుండా స్వయానా పెళ్లికూతురే పేల్చడం విశేషం.

వివరాల్లోకి వెళ్తే, వనపర్తి జిల్లాలోని చర్లపల్లి గ్రామంలో గత శుక్రవారం ఒక వివాహ వేడుక ఘనంగా జరుగుతోంది. వేడుకకు ఇరుపక్షాల బంధుగణం, స్నేహితులు, శ్రేయోభిలాషులు, తెలిసిన వారు, తెలియని వారు అందరూ హాజరయ్యారు. పెళ్లి వేడుకలో జరగాల్సిన అన్ని సంప్రదాయాలు పూర్తయ్యాయి. ఇక చివరి ఘట్టం, అతి ముఖ్యమైన ఘట్టం, మూడుమూళ్లు వేయడం మిగిలి ఉంది.

వధువు మెడలో వరుడు తాళి కట్టబోతుండగా "నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు" అని పెళ్లికూతురు చెప్పేసింది. దీంతో పెళ్లికొడుకు ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ఆహ్వానితులు ఆశ్చర్యపోయారు. ఈ హఠాత్పరిణామంతో ఖంగుతిన్న వధువు తల్లిదండ్రులు తమ కూతురుకి నచ్చజెప్పి పెళ్లి తంతు పూర్తికానిచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఎంతకూ మాటవినని ఆ వధువు, తనకు ఈ పెళ్లి వద్దేవద్దంటూ పెళ్లిపీఠల మీద నుంచి లేచి వెళ్లిపోయింది. దీంతో ఆ పెళ్లి కాస్త పీఠల మీదే నిలిచిపోయింది.

వధువు ప్రియుడు పెళ్లి మంటపంలో ప్రత్యక్షం అవ్వగానే అతడ్ని చూసి ఆమె ఈ పెళ్లి రద్దు నిర్ణయం తీసుకుందని బంధువులు గమనించారు.  అతణ్ని పట్టుకుందామనుకునే లోపు అక్కడ్నించి అతడు ఉడాయించాడు.  ఇక వరుడి తరఫు వారు వధువు తరఫు వారితో వాగ్వివాదానికి దిగారు.  మంటపంలో గందరగోళం నెలకొంది. చివరకు పోలీసులు ఎంటర్ అయి ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటూ ఇరుపక్షాల వారిని  సముదాయించి అక్కడ్నించి పంపించి వేశారు.

అయితే ఈ ఘటన పట్ల వధువును కొంతమంది అభినందిస్తుండగా, మరికొంత మంది మాత్రం విమర్శిస్తున్నారు. ఇంతదాకా రాకముందే ఆమె చెప్పాల్సి ఉండేదని అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల వరుడుకి నిరాశ, ఇరుపక్షాలకు నష్టం కలిగిందని చెబుతున్నారు.

ఇకపోతే పెళ్లి నిశ్చయమవడానికి ఇటు ఏడు తరాలు, అటు ఏడు తరాలు చూస్తారంటారు కానీ, పీఠల మీద పెళ్లి ఆగిపోవడానికి మాత్రం అలాంటివేమి చూడకుండా విచిత్రమైన కారణాలకు ఆగిపోయిన ఉదంతాలు ఎన్నో జరుగుతాయి. ఇటీవల గుజరాత్ రాష్ట్రంలో అయితే వరుడి తండ్రి, వధువు తల్లి లేచిపోవడంతో పెళ్లి ఆగిపోయింది. అలా ఒకసారి కాదు రెండు సార్లు లేచిపోయారు. ఆ కథలో రెండు పార్టులు  బ్లూఇంక్ లో హైలైట్ చేయబడిన లింక్ లో చూడొచ్చు.



సంబంధిత వార్తలు