ఒక అందమైన, విభిన్నమైన, విచిత్రమైన ప్రేమకథ గురించి గత జనవరిలోనే మీకు తెలియజేశాం. ఇప్పుడు చెప్పబోయే కథ దానికి సీక్వెల్. మధ్య వయస్కులైన ఓ జంట, అందులోనూ కాబోయే వియ్యంకులు. అందులో ఒకరు పెళ్లికొడుకు తండ్రి కాగా, మరొకరు పెళ్లికూతురు తల్లి. వారి పిల్లల పెళ్లి మరికొన్ని రోజులు ఉందనగా 2020 జనవరి 10న వీరిద్దరూ వారి వారి ఇండ్లలో నుంచి కనిపించకుండా పోయారు. ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఇరువురుకి చెందిన కుటుంబ సభ్యులు ఒకేరకమైన కంప్లైంట్ ఇచ్చి, ఒకరికి మొఖాలు ఒకరు చూసుకొని బిత్తరపోయారు. అక్కడే తెలిసింది వారిద్దరికి అంతకుముందే లఫ్ ఎఫైర్ ఉందని, వారిద్దరూ కలిసి లేచిపోయారని. ఈ ట్విస్ట్ తో పెళ్లి క్యాన్సిల్ అయింది. కానీ తర్వాత ఏమైంది? ఇరు కుటుంబాల్లో తరువాత జరిగిన పరిణామాలేంటి? వారిద్దరూ మళ్లీ తిరిగొచ్చారా? ఈ ప్రశ్నలకు సమాధానం పార్ట్ 2 ద్వారా తెలుసుకోండి.
ఆ తర్వాత ఏమైందంటే. కొన్నిరోజులకు జనవరి 26న వారిద్దరూ తమ తప్పు తెలుసుకొని ఒక నెల కిందట ఎవరి ఇంటికి వారు వచ్చేశారు. అయితే వధువు తండ్రి, లవర్ బోయ్ హిమ్మంత్ పాండవ్ (46) ఎలాగో అలా తన కుటుంబాన్ని కన్విన్స్ చేసి తన కుటుంబంతో ఎప్పట్లాగే కలిసిపోయాడు. కానీ అతడి ప్రేయసి శోభన (43)ను మాత్రం ఆమె భర్త ఇంట్లోకి రానివ్వలేదు, ఆమె అభ్యర్తనలను తిరస్కరించాడు. దీంతో శోభన తన పుట్టింటికి వెళ్లిపోయింది. కానీ, ఒక మహిళ ఈ రకంగా తిరిగి రావడం, తన ప్రేమకథ ఇప్పటికే పాపులర్ అవడం ఎవరికైనా ఇబ్బందే కదా?
దీంతో మళ్లీ తన ప్రియుడు, హిమ్మంత్ పాండేను ఆశ్రయించింది. చావైనా, బ్రతుకైనా ఇక తనతోనే అని డిసైడ్ అయింది. ఇటు హిమ్మంత్ పాండే కూడా తన చిన్ననాటి ప్రియురాలిని విడిచి ఉండలేకపోయాడు. దీంతో రెండు రోజుల క్రితం ఇద్దరూ కలిసి మళ్లీ లేచిపోయారు. వీరిద్దరు సూరత్ నగరంలో ఇల్లు అద్దెకు తీసుకొని వేరుకాపురం పెట్టారని కుటుంబ సభ్యులకు తెలిసింది. ఈసారి కుటుంబ సభ్యులు మాత్రం పోలీస్ కంప్లైంట్ లాంటిది ఏం ఇవ్వలేదు, వారినలా వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. Part1 చదవండి - పెళ్లి కొడుకు తండ్రి, పెళ్లి కూతురు తల్లి జంప్, పెటాకులైన పెళ్లి!
మున్ముందు వీరి ప్రేమకథ ఎన్ని మలుపులు తిరుగుతుందో ఆ కాలమే సమాధానం చెబుతోంది. ఎందుకంటే ఇది కథ కాదు, యదార్థగాధ