Mystery Object in Australia: ఆస్ట్రేలియా సముద్ర తీరంలో చంద్రయాన్-3 శకలం? రాగితో చేసిన డ్రమ్ము ఆకారంలో ఉన్న వస్తువు.. మిస్టరీని ఛేదించేందుకు రంగంలోకి ఆస్ట్రేలియా అంతరిక్ష పరిశోధన సంస్థ..
రాగితో చేసిన డ్రమ్ము ఆకారంలో ఉన్న ఆ వస్తువు ఏంటో అర్థంకాక స్థానికులు పెద్దయెత్తున చర్చించుకుంటున్నారు.
Newdelhi, July 18: పశ్చిమ ఆస్ట్రేలియాలోని (Western Australia) గ్రీన్ హెడ్ పట్టణ తీరంలో ఓ అంతుచిక్కని వస్తువు (Mystery Object) కలకలానికి దారితీసింది. రాగితో చేసిన డ్రమ్ము (Drum) ఆకారంలో ఉన్న ఆ వస్తువు ఏంటో అర్థంకాక స్థానికులు పెద్దయెత్తున చర్చించుకుంటున్నారు. ఇటీవల చంద్రయాన్-3 (Chandrayaan-3) ఆస్ట్రేలియా గగనతలంలో ప్రయాణించిన నేపథ్యంలో ఆ రాకెట్ నుంచి విడివడి కింద పడ్డ శకలం అయి ఉంటుందన్న చర్చ నెట్టింట మొదలైంది. అయితే, ఈ వస్తువుకు దూరంగా ఉండాలంటూ స్థానికులను అక్కడి అధికారులు హెచ్చరించారు.
అంతరిక్ష సంస్థ రంగంలోకి..
అయితే, అదృశ్య వస్తువు ఏంటో? ఎక్కడి నుంచి వచ్చిందో? తేల్చేందుకు ఆస్ట్రేలియా అంతరిక్ష సంస్థ రంగంలోకి దిగింది. విదేశీ అంతరిక్ష ప్రయోగానికి సంబంధించినది అయి ఉండొచ్చని అంచనా వేస్తోంది. అంతేకాకుండా, పలు దేశాలతో ఈ విషయమై సంప్రదింపులు జరుపుతున్నట్టు సోషల్ మీడియాలో వెల్లడించింది.