Robot Innovation: దివ్యాంగురాలైన కుమార్తెకు అన్నం తినిపించే రోబోను తయారుచేసిన కూలీ.. వాయిస్ కమాండ్‌తో పనిచేస్తున్న రోబో!

పెద్దగా చదువుకున్నది ఏమీ లేదు. అయితే నేం.. దివ్యాంగురాలైన తన కుమార్తెకు అన్నం తినిపించేందుకు వాయిస్ కమాండ్‌తో ఓ రోబోను తయారు చేసి టెక్ దిగ్గజాలను సైతం ఆశ్చర్యపరిచాడు.

Robot

Panaji, September 26: గోవా (Goa)లో అతనో దినసరి కూలి (Daily Labour). పెద్దగా చదువుకున్నది ఏమీ లేదు. అయితే నేం.. దివ్యాంగురాలైన తన కుమార్తెకు అన్నం తినిపించేందుకు వాయిస్ కమాండ్‌తో ఓ రోబోను తయారు చేసి టెక్ దిగ్గజాలను సైతం ఆశ్చర్యపరిచాడు. దక్షిణ గోవాలోని పొండా తాలూకా బితోరా గ్రామానికి చెందిన బిపిన్ కదమ్ (40)కు దివ్యాంగురాలైన కుమార్తె ఉంది. స్వయంగా భోజనం కూడా తినలేని కుమార్తెను చూసి బిపిన్ ఎంతగానో బాధపడేవాడు. ఆమె బాగోగులన్నీ భార్యే చూసుకునేది. అయితే, రెండేళ్ల క్రితం ఆమె కూడా మంచం పట్టింది. దీంతో కుమార్తెకు అన్నం తినిపించేవారు కరవయ్యారు. దినసరి కూలీ అయిన బిపిన్ ఉదయం వెళ్తే రాత్రికి ఇంటికి చేరుకునేవాడు. ఇలాగైతే లాభం లేదని కుమార్తెకు అన్నం తినిపించేందుకు రోబో ఏమైనా దొరుకుతుందేమోనని మార్కెట్లో వాకబు చేశాడు. అలాంటిదేమీ లేకపోవడంతో ఇక లాభం లేదని, తానే ఆ పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. పెద్దగా చదువుకోని బిపిన్ కూలికి వెళ్లి తిరిగి రాత్రికి ఇంటికొచ్చాక రోబోను తయారుచేయడం ఎలా అన్నదానిపై నాలుగు నెలలపాటు పరిశోధన చేశాడు. ఆ తర్వాత సాఫ్ట్‌వేర్ గురించి తెలుసుకుని, దానిపై అవగాహన పెంచుకున్నాడు. దాని సాయంతో నాలుగు నెలలు కష్టపడి ఓ రోబోను తయారుచేశాడు. పూర్తిగా వాయిస్ కమాండ్‌తో పనిచేసే దీనికి ‘మా రోబో(Ma Robot)’ (తల్లి రోబో) అని పేరు పెట్టాడు.

ఇటలీకి తొలి మహిళా ప్రధానిగా జార్జియా మెలోని.. తాజా ఎన్నికల్లో నేషనలిస్ట్ బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీకి మెజారిటీ

దాని చేతిలో ఆహారం ఉన్న పళ్లెం పెడితే అది కలిపి కుమార్తెకు తినిపించేలా డిజైన్ చేశాడు. అంతేకాదు, వాయిస్ కమాండ్ ద్వారా ఆహారాన్ని ఏ కూరతో కలిపి తినిపించాలో చెబితే రోబో అదే చేస్తోంది. ఈ రోబో విజయవంతంగా పనిచేస్తుండడంతో బిపిన్‌ ఆనందానికి హద్దే లేకుండా పోయింది. విషయం వెలుగులోకి రావడంతో గోవా స్టేట్ ఇన్నోవేషన్ కౌన్సిల్ (Goa State Innovation Council) బిపిన్‌పై ప్రశంసలు కురిపించింది. ఆయన తయారు చేసిన ‘మా రోబో’ను వాణిజ్య పరంగా ఉపయోగపడేలా తీర్చిదిద్దేందుకు ఆర్థిక సాయాన్ని అందిస్తామని ప్రకటించింది.