Most Popular CM: దేశంలో అత్యంత ప్రజాధరణ కలిగిన ముఖ్యమంత్రి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్.. మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో వెల్లడి.. టాప్-10 జాబితాలో ఇంకా ఎవరెవరు ఉన్నారంటే?
దేశంలో అత్యంత ప్రజాధరణ కలిగిన ముఖ్యమంత్రిగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నిలిచారు.దేశంలో అత్యంత ప్రజాధరణ కలిగిన, ఆమోదయోగ్యమైన ముఖ్యమంత్రుల జాబితాను మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే పేరిట ఓ ఆంగ్ల పత్రిక రూపొందించింది.
Newdelhi, Feb 19: దేశంలో అత్యంత ప్రజాధరణ కలిగిన ముఖ్యమంత్రిగా (Most Popular CM) ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నిలిచారు.దేశంలో అత్యంత ప్రజాధరణ కలిగిన, ఆమోదయోగ్యమైన ముఖ్యమంత్రుల జాబితాను మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే పేరిట ఓ ఆంగ్ల పత్రిక రూపొందించింది. ఇందులో ఒడిశాను 20 ఏండ్లకుపైగా పరిపాలిస్తున్న 77 ఏండ్ల నవీన్ పట్నాయక్ (CM Naveen Patnaik) 52.7 శాతంతో అగ్రస్థానంలో నిలిచారు. ఆయన 2000, మార్చి నెలలో సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి నిరాటంకంగా ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఇక, అయోధ్యలో బాల రాముని ఆలయ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanat) 51.3 శాతం రేటింగ్ తో రెండో స్థానంలో నిలిచారు.
ఇంకా టాప్-10లో ఎవరెవరు ఉన్నారంటే?
ఇంకా ఈ జాబితాలో 48.6 శాతం ఓట్లతో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ మూడో స్థానంలో , గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కు 42.6 శాతం ఓట్లతో నాలుగవ స్థానం దక్కించుకున్నారు. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా 41.4 శాతం ఓట్లతో ఐదో స్థానంలో నిలిచారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్ (41.1 శాతం) ఆరో స్థానంలో, ఉత్తరప్రదేశ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి (40.1 శాతం) ఓట్లతో ఏడో స్థానంలో, ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ 8వ స్థానంలో నిలిచారు. తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 35.8 శాతం ఓట్లతో 9వ స్థానంలో, 32.8 శాతం ఓట్లతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పదో స్థానంలో నిలిచారు. అయితే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు టాప్ 10లో చోటు దక్కించుకోలేదు.