Monsoon Special Train: వాటర్ కోచ్‌లో ప్రయాణించడం ఎలా? వాటర్ కోచ్ ప్రత్యేకతలు చూస్తే ఔరా అంటారు, ఎక్కడో కాదు ఇండియాలోనే!

అయితే ఈ వాటర్ కోచ్‌లో ప్రయాణించాలంటే అదృష్టం ఉండాలి. దీనిని ఎలా బుక్ చేసుకోవాలి, దీని ప్రత్యేకతలు ఏంటీ తెలుసుకోవాలంటే...

Image used for representational purpose only | (Photo Credits: Wikimedia Commons)

మీరు ఇప్పటివరకు ట్రైన్‌లో సాధారణ కోచ్‌లో ప్రయాణించి ఉంటారు, స్లీపర్ కోచ్‌లో ప్రయాణించి ఉంటారు, మహా అయితే ఏసి కోచ్‌లో ప్రయాణించి ఉంటారు అంతేగా? అంటే రైళ్లలో  అంతకుమించి ఇంకేం స్పెషల్ కోచ్‌లు ఉంటాయి అనుకుంటున్నారా? పరిచయం చేస్తున్నాం.. ఇండియన్ రైల్వేస్ సగర్వంగా సమర్పించు మాన్‌సూన్ స్పెషల్ 'వాటర్ కోచ్'.. వాటర్ కోచ్!

అయితే ఈ వాటర్ కోచ్‌లో ప్రయాణించాలంటే అదృష్టం ఉండాలి. దీనిని ఎలా బుక్ చేసుకోవాలి, దీని ప్రత్యేకతలు ఏంటీ తెలుసుకోవాలంటే  బెంగళూరు - దానాపుర్ మధ్య నడిచే సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌లో జూన్ 29, 2019న ప్రయాణించిన ప్యాసెంజర్‌లను అడిగితే వారు వివరంగా చెప్తారు.

వారు సాధారంగా ఏసి కోచ్ బుక్ చేసుకున్నారు, అయితే ఆ కోచ్‌లో ఏసి నుంచి చల్లటి గాలికి బదులుగా చల్లటి నీరు ప్యాసింజర్ల మీద గుమ్మరించింది. ఆ నీళ్లు ఎక్కడ్నించి వచ్చాయంటే రైళ్లలో ఉండే 'వాష్ రూం' లలో నుంచి ప్యాసింజర్ బెర్తుల మీదికి సరఫరా చేయబడి ఏసి గుండా ప్యాసెంజర్ల మీద గుమ్మరించాయి.

దీంతో తాము కేవలం ఏసి కోచ్ బుక్ చేసుకుంటే తమపై చల్లటి నీటిని కురిపించి తమను పరవశింపజేశారని తీవ్ర ఆనందోత్సాహాలకు గురైన ప్యాసెంజర్లు రైల్వే సిబ్బందిని అత్యంత వినమ్రపూర్వకంగా తమ మాటలతో గౌరవించారు.

అయితే అందుకు కుళ్లుకున్న రైల్వేశాఖ కేవలం 90 నిమిషాల్లో ఆ నీటికి అడ్డుకట్ట వేసి, ప్రయాణికుల ఆనందాన్ని ఆవిరి చేసింది. ఇప్పుడు తెలిసిందా మాన్ సూన్ స్పెషల్ వాటర్ కోచ్ ప్రత్యేకత? మామూలుగా ఉండదు మరి. రైళ్లలో ఇలాంటి ప్రత్యేకతలు ఉంటే ఎవరైనా సరే ఔరా అనాల్సిందే.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తూ కామెడీగా ట్రోల్స్ చేస్తున్నారు. వారి చూపించిన ఆ హాస్య చతురత స్పూర్తితో కేవలం నవ్వించడం కోసం ఈ సటైరిక్ స్టోరీ.