Toolbag Orbiting Earth: ఆకాశంలో కనిపిస్తున్న వింత వస్తువు.. వ్యోమగాముల పట్టు జారి భూమి చుట్టూ తిరుగుతున్న టూల్ కిట్ బ్యాగ్.. ఏమైనా ప్రమాదమా?
వ్యోమగాముల పట్టు నుంచి జారిన టూల్ కిట్ బ్యాగ్ భూమి చుట్టూ తిరుగుతున్నది.
Newdelhi, Nov 13: ప్రస్తుతం ఆకాశంలో కనిపిస్తున్న ఒక వింత వస్తువు అందరినీ ఆకట్టుకుంటున్నది. వ్యోమగాముల పట్టు నుంచి జారిన టూల్ కిట్ బ్యాగ్ (Toolbag) భూమి చుట్టూ (Orbiting Earth) తిరుగుతున్నది. (Toolbag Orbiting Earth) నవంబర్ 1న నాసా మహిళా వ్యోమగాములు తొలిసారి స్పేస్ వాక్ చేశారు. జాస్మిన్ మోఘ్‌బెలీ, లోరల్ ఓ’హారా కలిసి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్‌ఎస్)కు ఉన్న సోలార్ పరికరాలకు రిపేర్ చేశారు. ఈ సందర్భంగా ఒక టూల్ కిట్ బ్యాగ్ వారి పట్టు నుంచి జారిపోయింది. ఐఎస్‌ఎస్‌కు చెందిన కెమెరాలో ఇది రికార్డైంది.
ఫుజి పర్వతంపై నింగిలో తేలుతున్న బ్యాగ్
మహిళా వ్యోమగాముల పట్టు నుంచి జారిపోయిన టూల్ కిట్ బ్యాగ్ నాటి నుంచి భూమి చుట్టూ తిరుగుతున్నది. తెల్లని సంచి మాదిరిగా ఉన్న ఇది ఆకాశంలో మెరుస్తున్నది. బైనాక్యులర్స్ ద్వారా కూడా దీనిని చూడవచ్చు. గత వారం ఫుజి పర్వతంపై నింగిలో తేలుతున్న ఈ బ్యాగ్ ను జపనీస్ వ్యోమగామి సతోషి ఫురుకావా గుర్తించారు.
ఐఎస్‌ఎస్ కు ప్రమాదం ఉందా?
అంతరిక్షంలో ప్రకాశిస్తున్న ఈ టూల్ కిట్ బ్యాగ్ ఐఎస్‌ఎస్ కంటే రెండు నుంచి నాలుగు నిమిషాలు ముందుగా భూమి చుట్టూ తిరుగుతున్నదని నాసా తెలిపింది. దీని వల్ల ఐఎస్‌ఎస్‌కు లేదా అందులోని సిబ్బందికి ఎలాంటి ముప్పు లేదని పేర్కొంది. కొన్ని నెలల పాటు భూ కక్ష్యలో తిరిగే ఈ టూల్‌కిట్ బ్యాగ్ 2024 మార్చిలో భూ వాతావరణంలోకి ప్రవేశించి మండిపోతుందని అంచనా వేసింది.