Maharashtra Shocker: మహారాష్ట్ర ఆసుపత్రిలో భయంకరమైన దృశ్యం, ఒకవైపు కోవిడ్-19 మృతుల శవాలు, పక్కనే రోగులకు చికిత్స. ఇదేం పాలన అంటూ ప్రభుత్వ తీరుపై విరుచుకుపడిన విపక్షం

వారంతా ఇతర అనారోగ్య కారణాలతో చనిపోయిన వారు. ఇప్పుడుఈ COVID-19 మృతదేహాలను మార్చురీకి తరలిస్తే అది వేరే సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి ఆసుపత్రి బెడ్లపైనే పూర్తిగా చుట్టేసి ఉంచినట్లు తెలిపారు......

Video showing dead body lying near patients at Sion hospital (Photo Credits: Twitter)

Mumbai, May 7: కరోనావైరస్ విజృంభన కారణంగా మహారాష్ట్రలో పరిస్థితులు ఎంత దారుణంగా తయారవుతున్నాయో రోజూ చూస్తూనే ఉన్నాం, అయితే అంతకంటే దారుణమైన ఘటన ఒకటి వెలుగు చూసింది. ఒకవైపు ఎక్కడికక్కడ కోవిడ్-19 మృతుల శవాలు, అదే చోట రోగులకు చికిత్స అందిస్తున్న ఓ ఆసుపత్రికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు విడుదలైంది.

ముంబైలోని సియోన్ హాస్పిటల్ (Mumbai Sion Hospital) వార్డులో ఎక్కడ చూసినా బెడ్లపై బ్యాగ్ లలో చుట్టబడిన కోవిడ్-19 మృతదేహాలు ఒకవైపు మరియు వాటి పక్కనే మిగతా రోగులు చికిత్స తీసుకుంటున్నటువంటి దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. ఆ వార్డులో రోగులతో పాటు వారి కుటుంబ సభ్యులు, వచ్చిపోయే వారి తాకిడి కూడా ఎక్కువగానే ఉంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

మహారాష్ట్ర ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యే నితీశ్ రాణే కూడా ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. "సియాన్‌ ఆస్పత్రిలో మృతదేహాల పక్కనే నిద్రిస్తున్న రోగులు. మరీ ఇంత ఘోరమా? ఇదేం పాలన, సిగ్గుచేటు’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

See Photos

Video showing dead body lying near patients at Sion hospital (Photo Credits: Twitter)

మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలోనే భాగమైన కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి మిలింద్ డియోరా కూడా సియోన్ హాస్పిటల్ ఘటన పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. COVID-19 శవాలను తరలించే విషయంలో WHO మార్గదర్శకాలను ఎందుకు పాటించడం లేదని హాస్పిటల్ సిబ్బందిని నిలదీశారు. బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (BMC) దీనిపై దృష్టి పెట్టాలని సూచించారు. మహారాష్ట్ర సర్కార్ స్వయంకృత అపరాధం, అదే రాష్ట్రంలో కోవిడ్-19 విజృంభనకు కారణం

ఇక ఈ వ్యవహారంపై స్పందించిన సియోన్ ఆస్పత్రి డీన్‌ ప్రమోద్‌ ఇంగాలే మాట్లాడుతూ ఆస్పత్రి మార్చురీలో 15 స్లాట్లు ఉండగా, వాటిలో 11 ఇప్పటికే నిండిపోయాయి. వారంతా ఇతర అనారోగ్య కారణాలతో చనిపోయిన వారు. ఇప్పుడుఈ COVID-19 మృతదేహాలను మార్చురీకి తరలిస్తే అది వేరే సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి ఆసుపత్రి బెడ్లపైనే పూర్తిగా చుట్టేసి ఉంచినట్లు తెలిపారు.

అదీ కాకుండా కోవిడ్‌-19తో మరణించిన వారి మృతదేహాలను తీసుకువెళ్లేందుకు వారి బంధువులు ముందుకు రావడం లేదని తెలిపారు.

అయితే మృతదేహాలను బాడీ బ్యాగ్‌లో ప్యాక్ చేసిన తర్వాత ఇన్‌ఫెక్షన్ వ్యాప్తి చెందే అవకాశం లేదని ఆయన అన్నారు, అయినప్పటికీ మృతదేహాలన్నింటినీ క్లియర్ చేసినట్లు డా. ప్రమోద్ స్పష్టం చేశారు. మృతదేహాలను ఏర్పాట్లు చేస్తున్నపుడే ఈ వీడియో తీసి ఉంటారని, ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని వెల్లడించారు.

దేశంలో ఎక్కడా లేనంతగా కరోనావైరస్ మహారాష్ట్రపై ప్రతాపం చూపుతోంది. రాష్ట్రంలో ఇప్పటికే కోవిడ్-19 కేసులు 17 వేలకు చేరుకున్నాయి, ఒక్క ముంబైలోనే 10,714కు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 400కు పైగా బాధితులు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.