Violence at Devaragattu Karrala Samaram: మల్లన్న సాక్షిగా మరోసారి చిందిన రక్తం.. దేవరగట్టు కర్రల సమరంలో చెలరేగిన హింస.. 92 మందికి గాయాలు.. ముగ్గురి పరిస్థితి విషమం
కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టులో బన్నీ ఉత్సవంలో మరోసారి రక్తపుటేరులు పారాయి.
Vijayawada, Oct 13: విజయదశమి (Vijayadashami) సందర్భంగా మల్లన్న సాక్షిగా మరోసారి రక్తం చిందింది. కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టులో (Violence at Devaragattu Karrala Samaram) బన్నీ ఉత్సవంలో మరోసారి రక్తపుటేరులు పారాయి. పోలీసులు వద్దని చెప్పినా వినకుండా.. యథావిధిగా కర్రల సమరం కొనసాగింది. మనుషుల రక్తంతో మాలమల్లేశ్వరస్వామికి రక్తతర్పణ జరిగిపోయింది. ఉత్సవంలో భాగంగా చోటు చేసుకున్న ఉద్రిక్తతలో 92 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి తరలివచ్చిన దాదాపు లక్ష మందికి పైగా భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు.
ఏమిటీ ఉత్సవం?
దసరా పండుగ సందర్భంగా దేవరగట్టులో కొలువైన మాళమ్మ, మల్లేశ్వరుని కల్యాణోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఉత్సవమూర్తులను ఊరేగింపుగా కొండ పైకి తీసుకెళ్లి, ఆలయ నిర్వాహక గ్రామాలైన నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చేరుకుని కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేస్తారు. అర్ధరాత్రి జరిగే ఈ ఉత్సవంలో ప్రతిసారీ గాయాలపాలవుతున్న వారిపట్ల నిరసనలు వెల్లువెత్తుతున్నా, ఉత్సవం మాత్రం ఆగకుండా కొనసాగుతోంది.