
Tirumala, FEB 28: వేసవిలో తిరుమలను దర్శించుకునే భక్తులకు టీటీడీ (TTD) గుడ్‌న్యూస్ తెలిపింది. ముఖ్యంగా విద్యాసంస్థలకు సెలవుల కారణంగా తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ పెరిగే అవకాశముందని ముందు జాగ్రత్తగా పలు ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి (Venkaiah Chowdhary) వెల్లడించారు. ఈమేరకు తిరుమలలోని అన్నమయ్య భవనంలో వేసవి సెలవుల యాత్రికుల రద్దీకి సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. మొదటి ఘాట్ రోడ్డులోని అక్కగార్ల గుడి, శ్రీవారి సేవా సదన్, తిరుమలలో భక్తుల రద్ధీ అధికంగా ఉండే ప్రాంతాల్లో చలువ పెయింట్ వేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. యాత్రికులకు అసౌకర్యం కలగకుండా విద్యుత్ సరఫరా నిరంతరాయంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. తగినంత లడ్డూల బఫర్ స్టాక్‌ను ఉంచాలని సూచించారు. యాత్రికుల కోసం ఓఆర్ఎస్ ప్యాకెట్లను (ORS Packets) తగినంత నిల్వ ఉంచాలని వైద్య అధికారులతో అన్నారు.
రాబోవు వేసవిలో తిరుమలలోని అన్ని ప్రాంతాల్లో భక్తులకు అవసరమైన నీటిని సరఫరా చేసేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు లోకనాథం, రాజేంద్ర, భాస్కర్, ట్రాన్స్‌పోర్ట్ జీఎం శేషారెడ్డి, వీజీవోలు రామ్ కుమార్, సురేంద్ర, అధికారులు పాల్గొన్నారు.