Cancer Cells: అమైనోసియానైన్ అణువులతో క్యాన్సర్ కణాలు 99% అంతం.. కొత్త పద్ధతిని అభివృద్ధి చేసిన పరిశోధకులు
ఈ అణువులను సాధారణంగా బయో ఇమేజింగ్ లో సింథటిక్ రంగులుగా వాడతారు.
Hyderabad, Dec 29: అమైనోసియానైన్ (Aminocyanine) అణువులను ఉపయోగించి క్యాన్సర్ కణాలను (Cancer Cells) తొలగించే కొత్త పద్ధతిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ అణువులను సాధారణంగా బయో ఇమేజింగ్ లో సింథటిక్ రంగులుగా వాడతారు. సైన్స్ అలర్ట్ జర్నల్ లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం ఈ అణువులను పరారుణ కాంతికి దగ్గరగా ఉద్దీపనం చేసినప్పుడు క్యాన్సర్ కణాలను విచ్ఛిన్నం చేసే సామర్థ్యాన్ని పొందుతాయి. రైస్ యూనివర్సిటీ కెమిస్ట్ జేమ్స్ టూర్ ప్రకారం మాలిక్యూలర్ జాకమర్స్ గా పిలిచే ఈ అణువులు ఫెరింగా టైప్ మోటార్స్ అణువులతో పోలిస్తే పది లక్షల రెట్లు వేగంగా యాంత్రిక చలనంలో పనిచేస్తాయి. వీటిని పరారుణ కాంతికి దగ్గరగా ఉపయోగించడం వల్ల శరీరం లోపలికి వ్యాప్తి చెందుతాయి. ఎముకలు, అవయవాల క్యాన్సర్ చికిత్సలో శస్త్ర చికిత్సల అవసరాన్ని ఈ కొత్త పద్ధతి తగ్గిస్తుంది. ఈ కొత్త పద్ధతిని ఎలుకలపై ప్రయోగించినప్పుడు విజయవంతమైంది. అమైనోసియానిన్ అణువులు కదిలినప్పుడు అందులోని ఎలక్ట్రాన్లు ప్లాస్మాన్లను ఏర్పరుస్తాయి. ఈ ప్లాస్మాన్లు ప్రకంపనల ద్వారా క్యాన్సర్ కణాలను అంతం చేస్తాయి. అయితే ఈ ప్రయోగాలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి.