Hyderabad, Dec 29: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana State Government) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన (Prajapalana) కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. అధికారుల బృందాలు గ్రామాలు, పట్టణ ప్రాంతాలకు వెళ్లి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాయి. దరఖాస్తుల సమర్పణకు పౌరులు పోటెత్తారు. మొదటిరోజు 7,46, 414 దరఖాస్తులు స్వీకరించినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి 2,88,711 దరఖాస్తులు వచ్చాయని, పట్టణ ప్రాంతాల్లో 4,57,703 మంది దరఖాస్తు చేసుకొన్నారని వెల్లడించారు.
దరఖాస్తుల కొరత
దరఖాస్తు ఫారాలను ప్రజలకు అధికారులు ఉచితంగా ఇవ్వాలని, వాటిని విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని ప్రధాన కార్యదర్శి హెచ్చరించారు. అయితే, ఈ కార్యక్రమంలో తొలిరోజే అనేక చోట్ల గందరగోళం నెలకొన్నది. చాలాచోట్ల దరఖాస్తు ఫారాల కొరత ఏర్పడింది. ఇదే అదనుగా జిరాక్స్ సెంటర్ల యజమానులు ఒక్కో దరఖాస్తు ఫారం జిరాక్స్ తీసేందుకు రూ.30 నుంచి రూ.100 వరకు కూడా వసూలు చేశారు.
సందేహాల కోసం
దరఖాస్తు ఫారంలోని అంశాలపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను అధికారులు తీర్చలేకపోవటంతో పలుచోట్ల వాగ్వాదాలు చోటుచేసుకొన్నాయి. ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే కంట్రోల్ రూమ్ నంబరు- 040-23120410కు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు. దరఖాస్తు ఫారం emunicipal.telangana. gov.in వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉన్నదని వివరించారు.