New Delhi, DEC 28: సైబర్ మోసగాళ్లు (Cyber Fraud) రోజుకో ఎత్తు వేస్తున్నారు. అమాయకులను బుట్టలో వేసుకోవడానికి రకరకాల ఎత్తుల జిత్తులకు పాల్పడుతున్నారు. సాధారణంగా ప్రతి ఒక్కరూ కొత్త సినిమా అంటే రిలీజ్ కాగానే చూసేద్దాం అన్న ఆసక్తి కలిగి ఉంటారు. ఇప్పుడు అంతా ఆన్ లైన్ కావడంతోపాటు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ రావడంతో సినిమాలతోపాటు వెబ్ సిరీస్‌లు, సీరియళ్లు కూడా వెంటనే చూడాలని భావిస్తారు. అలా వాటిని చూడటానికి టెలిగ్రామ్ (Telegram ) గుర్తుకు వస్తుంది. ఓటీటీలో రిలీజ్ కాగానే.. సంబంధిత ప్లాట్ ఫామ్‌లో సబ్ స్క్రిప్షన్ లేకున్నా.. టెలి గ్రామ్‌లో (Telegram Links) ప్రత్యక్షమవుతుంది. దీంతో యూజర్లు టెలిగ్రామ్ గ్రూపుల్లో ఇబ్బడి ముబ్బడిగా చేరిపోతున్నారు. యూజర్ల ఆసక్తిని సొమ్ము చేసుకోవడానికి సైబర్ మోసగాళ్లు నూతన మోసాలకు దిగుతున్నారు.
సినిమా పేరు సెర్చ్ చేయగానే టెలిగ్రామ్‌లో ఫ్రీ డౌన్ లోడింగ్ అనే లింక్ లు కనిపించగానే.. పలువురు యూజర్లు దాన్ని క్లిక్ చేస్తారు. ఫ్రీగా సినిమా చూడాలంటే యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలన్న సూచన వస్తుంది. అలా వచ్చిన సూచన పూర్వాపరాలు చెక్ చేసుకోకుండా సదరు యాప్ డౌన్ లోడ్ చేసుకున్నారో ఇంతే సంగతులు. మీ పర్సనల్ డేటా.. అందులో మీ వ్యక్తిగత బ్యాంకు ఖాతా డిటైల్స్ సైబర్ మోసగాళ్ల చేజిక్కుతాయి. అటుపై వారు చేతివాటం ప్రదర్శించి.. మీ ఖాతాల్లోని సొమ్ము ఖాళీ చేస్తున్నారని కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పని చేస్తున్న సైబర్ దోస్త్ తెలిపింది. ఈ తరహా మోసాల పట్ల అలర్ట్‌గా ఉండాలంటూ.. టెలిగ్రామ్ లింక్‌ల ద్వారా వచ్చే యాప్‌లను డౌన్ లోడ్ చేసుకోవద్దని స్పష్టం చేసింది.