Polio Virus in UK: మురుగునీటిలో పోలియో వైరస్, మలంలోంచి మురుగునీటిలోకి చేరినట్లు అంచనా వేసిన యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ, 40 ఏళ్లలో మొదటిసారి
40 ఏళ్లలో మొదటిసారి కనిపించడంతో అక్కడి ఆరోగ్య అధికారులు అప్రమత్తమయ్యారు. పిల్లలందరికీ వెంటనే పోలియో టీకాలు వేయించాలని తల్లిదండ్రులను హెచ్చరించారు
మురుగునీటిలో పోలియో వైరస్ కనిపించడం యూకేలోని లండన్‌లో కలకలం రేపింది. 40 ఏళ్లలో మొదటిసారి కనిపించడంతో అక్కడి ఆరోగ్య అధికారులు అప్రమత్తమయ్యారు. పిల్లలందరికీ వెంటనే పోలియో టీకాలు వేయించాలని తల్లిదండ్రులను హెచ్చరించారు. ఈ వైరస్ వ్యాక్సిన్ ఉత్పన్నం అని తాము భావిస్తున్నట్లు యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ వెల్లడించింది. విదేశాల్లో పోలియో చుక్కలు వేసుకున్న వ్యక్తి మలంలోంచి ఇది మురుగునీటిలోకి చేరినట్లు అంచనా వేస్తున్నారు. యూకేలో లైవ్ ఓరల్ పోలియో (నోటిద్వారా పోలియో చుక్కలు) వ్యాక్సిన్ వినియోగాన్ని 2004లోనే ఆపేశారు. నిష్క్రియాత్మక వర్షన్‌ను వినియోగిస్తున్నారు.
అయితే మురుగునీటి నుంచి పోలియో వైరస్ ప్రజలకు సోకే ప్రమాదం తక్కువని అధికారులు పేర్కొన్నారు. మురుగునీటి నమూనాల్లో మాత్రమే వైరస్ కనుగొన్నామని చెప్పారు. ఇప్పటివరకూ దేశంలో పోలియో కేసులు నమోదు కాలేదని వెల్లడించారు. అయినప్పటికీ ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు పోలియో వ్యాక్సిన్ వేయించారో? లేదో? తనిఖీ చేసుకోవాలని సూచించారు.