Vinesh Phogat Retires: ‘నాపై రెజ్లింగ్ గెలిచింది.. నేను ఓడిపోయా..’ కుస్తీకి వినేశ్ ఫోగాట్ గుడ్ బై.. సిల్వర్ మెడల్ పై తీర్పు రాకముందే సంచలన నిర్ణయం తీసుకున్న భారత స్టార్ రెజ్లర్
‘కుస్తీ నాపై గెలిచింది.. నేను ఓడిపోయా’ అంటూ భావోద్వేగంతో ఆమె ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
Newdelhi, Aug 8: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ (Vinesh Phogat) రెజ్లింగ్ కు రిటైర్‌మెంట్ (Retirement) ప్రకటించారు. ‘కుస్తీ నాపై గెలిచింది.. నేను ఓడిపోయా’ అంటూ భావోద్వేగంతో ఆమె ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. పారిస్ గడ్డపై త్రివర్ణపతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించాలనుకున్న ఆమె ఆశలను అదనపు బరువు తుడిచివేసింది. దీంతో రెజ్లింగ్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఎక్స్ లో పోస్ట్ చేసింది. ‘రెజ్లింగ్ నాపై గెలిచింది. నేను ఓడిపోయాను. నన్ను క్షమించు. మీక, నా ధైర్యం విచ్ఛిన్నమైంది. నాకు ఇంకా పోరాడే బలం లేదు. మీ అందరికీ రుణపడి ఉంటాను’ అని పేర్కొన్నారు. రెజ్జింగ్ 2001-2024 గుడ్ బై అంటూ ట్వీట్ చేశారు. అద్భుతమైన ప్రదర్శనతో పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ 50 కిలోల ఫ్రీస్టయిల్ విభాగంలో ఫైనల్ లోకి దూసుకెళ్లి, ఆ ఘనత సాధించిన తొలి భారత రెజ్లర్ గా చరిత్ర సృష్టించిన వినేశ్ ఫొగాట్ దేశానికి మరో పతకం ఖరారు చేసిందని భారత్ సంబరాలు చేసుకుంటుండగానే చేదుగుళిక లాంటి ఈ వార్తా వినాల్సి వచ్చింది.
తీర్పు రావడానికి ముందే..
నిర్దేశిత బరువు కంటే 100 గ్రాములు అధికంగా ఉందన్న కారణంతో ఆమెను అనర్హురాలిగా తేల్చడంతో దేశం యావత్తు నిర్ఘాంతపోయింది. తనను అనర్హురాలిగా ప్రకటించడంపై వినేశ్ ‘కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్’ను ఆశ్రయించింది. తాను రజత పతకానికి అర్హురాలినని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై తీర్పు రావడానికి ముందే వినేశ్ రిటైర్మెంట్ ప్రకటించి కోట్లమంది భారతీయుల హృదయాలను బరువెక్కించింది.