New Delhi, SEP 08: కాంగ్రెస్ పార్టీలో చేరిన ఒలింపిక్ రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ చీఫ్, బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్‌కు (Brij Bhushan) ఆ పార్టీ వార్నింగ్ ఇచ్చింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు వారిపై ఎలాంటి ప్రకటనలు చేయవద్దని సూచించింది. బ్రిజ్ భూషణ్ సింగ్ తమను వేధించినట్లు మహిళా రెజ్లర్లు గత ఏడాది ఆరోపించారు. వారు చేపట్టిన నిరసనకు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా నేతృత్వం వహించారు. సెప్టెంబర్ 6న వారిద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హర్యానా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.
కాగా, వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఎన్నికల్లో పోటీ చేయడంపై బ్రిజ్ భూషణ్ స్పందించారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తామని వారు అనుకుంటే పొరబడుతున్నట్లే. హర్యానాలోని ఏ అసెంబ్లీ స్థానంలోనైనా వారు పోటీ చేయవచ్చు. అయితే చిన్నస్థాయి బీజేపీ అభ్యర్థి వారిని ఓడిస్తారు’ అని అన్నారు.
మరోవైపు రెజ్లింగ్‌లో పేరు తెచ్చుకుని ప్రసిద్ధి చెందిన వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా కాంగ్రెస్‌లో చేరిన తర్వాత కనుమరుగవుతారని బ్రిజ్ భూషణ్ విమర్శించారు. ‘వారు (పునియా, ఫోగట్) పావులు. హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ హుడా, కాంగ్రెస్, కాంగ్రెస్ కుటుంబం వారిని పావుల్లా వాడుకుంటున్నారు. రెజ్లింగ్ ఫెడరేషన్‌పై పట్టు కోసం బీజేపీ, దాని భావజాలంపై దాడి చేసేందుకు ఇదంతా కుట్రపన్నారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌తో కూడిన ఈ బృందం ఈ పనులు చేయిస్తున్నారు’ అని ఆరోపించారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఆయనకు వార్నింగ్ ఇచ్చింది. వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని పేర్కొంది.