Junior Malinga: లసిత్ మలింగాకి వారసుడొచ్చాడు, యార్కర్లతో విరుచుకుపడుతున్న పతిరానా, బౌలింగ్ యాక్షన్ అచ్చుగుద్దినట్లుగా అదే శైలి, కాలేజి గేమ్‌లో ఏడుపరుగులకే ఆరు వికెట్లు

అచ్చు గుద్దినట్లుగా అదే యాక్షన్, అదే యార్కర్లు, కాలేజీ లెవల్ మ్యాచుల్లో అదరగొడుతున్నాడు.

17-year-old college student Pathirana with action similar to Lasith Malinga (Photo-Twitter)

Sri lanka, Septemebr 27: శ్రీలంక క్రికెట్‌ టీమ్‌కి మరో లసిత్ మలింగా దొరికాడు. అచ్చు గుద్దినట్లుగా అదే యాక్షన్, అదే యార్కర్లు, కాలేజీ లెవల్ మ్యాచుల్లో అదరగొడుతున్నాడు. అతని బౌలింగ్ యాక్షన్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీలంకకు చెందిన 17 ఏళ్ల మతీషా పతిరాణా ప్రస్తుతం కాలేజ్‌ మ్యాచ్‌ల్లో దుమ్మురేపుతున్నాడు. మలింగాను స్పూర్తిగా తీసుకున్న పతిరాణా.. అదే శైలిని అవలంభిస్తూ యార్కర్లతో రెచ్చిపోతున్నాడు. ఇటీవల ఓ కాలేజ్‌ గేమ్‌లో ఆడిన పతిరాణా ఏడు పరుగులిచ్చి ఆరు వికెట్లు సాధించాడు. ప్రధానంగా యార్కర్లేనే తన ఆయుధంగా వేస్తూ బ్యాట్స్‌మెన్‌కు వణుకుపుట్టిస్తున్నాడు. అచ్చం మలింగానే గుర్తు చేస్తుండటంతో జాతీయ జట్టులోకి రావడానికి ఎక్కువ కాలం పట్టకపోవచ్చని పలువురు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం పతిరాణాకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

జూనియర్ మలింగా బౌలింగ్

ఇక లసిత్‌ మలింగా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యార్కర్లను సంధించడంలో వసీం అక్రం తరువాత అతని పేరునే చెప్పుకోవచ్చు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆల్‌ టైమ్‌ దిగ్గజాల్లో మలింగా పేరు టాప్ 5లో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే 2006 నుంచి 2013 వరకూ మలింగా శకంగా చెప్పుకోవచ్చు. ఈ కాలంలో మలింగా 267 వికెట్లు సాధించి ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. శ్రీలంక తరఫున వన్డేల్లో అత్యధిక వికెట్లు సాధించిన మూడో బౌలర్‌ మలింగా నిలిచాడు. తన వన్డే కెరీర్‌లో మొత్తం 338 వికెట్లు సాధించాడు.

అయితే ఇటీవల వన్డేలకు గుడ్‌ బై చెప్పిన మలింగా గత నెలలో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు సాధించి తనలోని పవర్‌ను మరోసారి ప్రపంచానికి చూపించాడు. అయితే మలింగాకు రీప్లేస్ లో ఎవరూ వస్తారా అని ఎదురుచూస్తున్న శ్రీలంక క్రికెట్ కి మతీషా రూపంలో మరో బౌలర్ దొరికినట్లే..విచిత్రం ఏమిటంటే ఆ యువ క్రికెటర్‌ కూడా శ్రీలంకకు చెందిన వాడే. మరి ఈ జూనియర్ మలింగా కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి.