CWC19 Fans Reaction: ఎన్నెన్నో అనుకుంటాం.. అన్నీ జరుగుతాయా ఏంటి? 2019 ప్రపంచ కప్‌లో భారత్ నిష్క్రమణ తర్వాత అభిమానుల పరిస్థితి ఇదీ!

ఈ ఓటమికి కారణం వర్షమా..? రెండు రోజుల ఆటనా? ఆటగాళ్ల వైఫల్యమా? మన దురదృష్టమా? ఒక విశ్లేషణ...

ICC CWC19- Indian Supporters | Credits : ICC

ఎవరు చెప్పారు ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగే బ్రేకప్ అన్నింటికంటే ఎక్కువ బాధగా ఉంటుందని? వరల్డ్ నెంబర్ 1 బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ 1 పరుగు మాత్రమే చేసినప్పుడు, టోర్నీలో 5 సెంచరీలు కొట్టి వరల్డ్ నెంబర్ 1 హిట్టర్‌గా పేరు తెచ్చుకున్న రోహిత్ శర్మ 1 పరుగు చేసినప్పుడు, జెర్సీ నెంబర్ 1 ధరించే కేఎల్ రాహుల్ కూడా ఒక్కటంటే 1 పరుగు తీసి వెనక్కి వస్తుంటే... కాదాండీ.. బాధ ఉండదా అండి? కోట్ల మంది భారతీయుల ప్రపంచ కప్ కల (CWC19) మొదటి 40 నిమిషాల చెడ్డ ఆటతో చెదిరిపోయింది.

టోర్నీ ఆరంభం నుంచి అందరితో తిట్లు తినుకుంటూ కూడా ఆ ఎం.ఎస్ ధోనీ 50 రన్స్ చేసి దురదృష్టవశాత్తూ రన్‌ఔట్ అయి తీవ్ర నిరాశతో పెవిలియన్ వైపు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వస్తే ఎంత మంది కన్నీళ్లు పెట్టుకున్నారు? ఇద కాదా దుఖం, బాధ అంటే.

Fans Reactions - 2019 ప్రపంచ కప్‌లో టీమ్ ఇండియా ఓటమి ఎంతో మందిని నిరాశకు గురిచేసింది. ఇండియా ఓటమి కంటే ఓటమికి కలిగిన పరిస్థితులు ఎక్కువగా బాధించాయి. టాప్ ఆర్డర్ విఫలమైనా అంతకుముందు విమర్శలు ఎదుర్కొన్న రవీంద్ర జడేజా, ఎం.ఎస్ ధోనీ వీరోచిత పోరాటం చాలా మందిని భావోద్వేగానికి గురిచేశాయి. ఓటమి తర్వాత సోషల్ మీడియాలో ఎవరికివారు వారికి తోచినట్లుగా వారి బాధను వ్యక్తం చేశారు. ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ నిజమౌతాయా ఏంటి సరిసరిలే అనుకుంటూ వారికి వారే బాలయ్య స్టైల్లో ఓదార్చుకున్నారు.

India Score Card in Semi Final | CWC19
New Zealand Score Card

ఈ ఓటమికి కారణం వర్షమా..? రెండు రోజుల ఆటనా? ఆటగాళ్ల వైఫల్యమా? మన దురదృష్టమా?

ఎన్నో అంచనాల మధ్య ఐసీసీ ప్రపంచ కప్ 2019 కోసం సిద్ధమైన 'మెన్ ఇన్ బ్లూ' అందుకు తగ్గట్లుగానే లీగ్ స్టేజిలో ఒక్కొక్క టీంను దంచికొట్టింది. లీగ్ దశలో అత్యధిక విజయాలు, మెరుగైన పాయింట్లు సాధించిన జట్టుగా భారత్ మొదటి స్థానంతో సెమీ ఫైనల్‌లోకి ప్రవేశిచింది. సాధారణంగా మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. ఇందులో మొదటి స్థానంలో నిలిచిన జట్టు నాలుగో స్థానంలో నిలిచిన జట్టుతో, అలాగే రెండో స్థానంలో నిలిచిన జట్టు మూడవ స్థానంలో నిలిచిన జట్టుతో సెమీస్‌లో తలపడాల్సి ఉంటుంది.

ఈ క్రమంలో 2019 ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో మొదటి స్థానంలో నిలిచిన భారత్, నాలుగో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్ జట్టుతో సెమీస్ పోరులో తలపడింది. వర్షసూచన ఉండటంతో ఇక్కడ ముందు ఎవరు బ్యాటింగ్ చేస్తే వారికే ఉపకారం. దీంతో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఇంకో మాట లేకుండా బ్యాటింగ్ తీసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 46.1 ఓవర్లలో 211/5 స్కోరుతో ఉన్నప్పుడు భారీ వర్షం పడి మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను అక్కడే నిలిపివేశారు. ఆ తర్వాత వర్షం తగ్గకపోవడం, వాతావరణం సరిగా లేక మ్యాచ్ జరిగే పరిస్థితి లేకపోవడంతో ఆ మ్యాచ్‌ను రిజర్వ్‌ డేకు మార్చారు.

ఒకవేళ ఆ మ్యాచ్ పూర్తిగా రద్దై,ఫలితం తేలని పక్షంలో రెండు జట్లకు చెరో పాయింట్ ఇచ్చి, ఎక్కువ పాయింట్లు, మెరుగైన రన్ రేట్ ఉన్న జట్టుగా భారత్‌ను నేరుగా ఫైనల్‌కు పంపించేవారు. కానీ అక్కడే వర్షం టీమిండియాకు ట్విస్ట్ ఇచ్చింది. రిజర్వ్ డే కూడా పడతాను అని సమాచారం ఇచ్చిన వర్షం చివరికి హ్యాండ్ ఇచ్చింది.

ఇక రిజర్వ్ డేలో పిచ్ బౌలింగ్‌కు అనుకూలించడంతో న్యూజిలాండ్ బౌలర్లు వికెట్ల పండగ చేసుకున్నారు. రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్‌కు దిగిన భారత బ్యాట్స్‌మెన్ ఎలా ఔట్ అయ్యారో, ఎంత స్కోర్ చేశారో మనందరికి తెలుసు. రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ చివరి వరకు ప్రయత్నం చేసినా పరిస్థితులు, అవకాశాలు న్యూజిలాండ్‌కే ఎక్కువగా అనుకూలించాయి. ఇంకేముంది ఫలితం తారుమారైంది. టైటిల్ ఫేవరెట్‌గా ఫైనల్ చేరుతుందనుకున్న భారత జట్టు కథ కంచికి, అందరూ ఇంటికి అన్నట్లు అయింది. ఏం చేస్తాం, ఈసారి బ్యాడ్ లక్ మళ్ళీ 2023లో ప్రపంచ కప్ వస్తుంది.. ఆ సాలా కప్ నమ్‌దే! జైహింద్!!