Asia Cup 2023 Schedule Announced: సెప్టెంబరు 2న శ్రీలంకలో దాయాదులతో భారత్ పోరు, ఆగష్టు 30 నుంచి ఆసియా వన్డే కప్-2023, పూర్తి షెడ్యూల్ ఇదిగో..
పాకిస్తాన్, శ్రీలంక వేదికగా జరుగనున్న ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా ప్రకటించారు.
క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ఆసియా వన్డే కప్-2023 షెడ్యూల్ విడుదలైంది. పాకిస్తాన్, శ్రీలంక వేదికగా జరుగనున్న ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా ప్రకటించారు. ట్విటర్ వేదికగా బుధవారం ఈ విషయాన్ని తెలియజేశారు. ఆగష్టు 30న ఆరంభం కానున్న ఈ ఈవెంట్ సెప్టెంబరు 17న ఫైనల్ మ్యాచ్‌తో ముగియనుంది.
పాకిస్తాన్‌లోని ముల్తాన్ వేదికగా పాకిస్తాన్- నేపాల్ మ్యాచ్ మొదలై.. శ్రీలంకలోని కొలంబోలో ఫైనల్‌తో ఈ మెగా ఈవెంట్‌కు తెరపడనుంది. ఇక దాయాదులు భారత్- పాకిస్తాన్ సెప్టెంబరు 2న శ్రీలంకలోని క్యాండీ వేదికగా తలపడనున్నాయి. ఇక ఆ తర్వాత టీమిండియా సెప్టెంబరు 4న నేపాల్‌తో అదే వేదికపై మ్యాచ్ ఆడనుంది.
కాగా ఆసియా వన్డే కప్-2023 గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్‌తో పాటు నేపాల్ ఉండగా.. గ్రూప్-బిలో బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, శ్రీలంక ఉన్నాయి. గ్రూప్ దశలో మొత్తం ఆరు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇందులో రెండు గ్రూపుల నుంచి తొలి రెండుస్థానాల్లో నిలిచిన జట్లు సూపర్-4కు అర్హత సాధిస్తాయి.
Here's ANI Tweet
గ్రూప్-ఏ టాపర్‌గా నిలిచిన జట్టు, గ్రూప్-బిలో రెండో స్థానంలో నిలిచిన జట్టుతో సెప్టెంబరు 6న సూపర్-4లో తొలి మ్యాచ్ ఆడుతుంది. సెప్టెంబరు 15న సూపర్-4 చివరి మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాప్-2 జట్లు సెప్టెంబరు 17నాటి ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.
ఇక ఈ టోర్నీ నిర్వహణ హక్కులు పాకిస్తాన్ చేజిక్కించుకోగా.. టీమిండియా పాక్ పర్యటనకు సుముఖంగా లేని నేపథ్యంలో హైబ్రిడ్ మోడల్‌ను ఆశ్రయించారు. ఇందులో భాగంగా పాక్‌లోని ముల్తాన్‌లో ఒక మ్యాచ్.. లాహోర్‌లో మూడు మ్యాచ్‌లు జరుగనుండగా.. శ్రీలంకలోని క్యాండీలో మూడు, కొలంబోలో 6 మ్యాచ్‌లు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. కాగా గతేడాది జరిగిన ఆసియా టీ20 టోర్నీ ఫైనల్లో పాక్‌ను ఓడించి శ్రీలంక విజేతగా అవతరించిన విషయం తెలిసిందే.