Babar New Record: కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్.. టీ20ల్లో వేగంగా 8 వేల మార్కు దాటిన రెండో ఆటగాడి రికార్డు.. విరాట్ ను మూడో స్థానానికి నెట్టిన పాకిస్థాన్ కెప్టెన్.. ఇంగ్లండ్ తో రెండో టీ20లో పాక్ ఘన విజయం
ఈ ఫార్మాట్ లో వేగంగా 8000 పరుగులు చేసిన బ్యాటర్ గా కోహ్లీ అధిగమించి రెండో స్థానానికి దూసుకెళ్లాడు.
NewDelhi, September 23: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ (Babar) ఆజమ్ టీ20ల్లో (T20) భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ (Kohli) రికార్డును బద్దలు కొట్టాడు. ఈ ఫార్మాట్ లో వేగంగా 8000 పరుగులు చేసిన బ్యాటర్ గా కోహ్లీ అధిగమించి రెండో స్థానానికి (Second Place) దూసుకెళ్లాడు. కోహ్లీ 243 ఇన్నింగ్స్ ల్లో ఈ ఘనత సాధించగా.. బాబర్ ఆజమ్ 218 ఇన్నింగ్స్ ల్లోనే 8 వేల పరుగుల మార్కు చేరుకున్నాడు. వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ 214 ఇన్నింగ్స్ ల్లో 8 వేల పరుగుల మైలురాయి చేరుకొని అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు.
గురువారం రాత్రి కరాచీలో ఇంగ్లండ్ తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో సెంచరీ చేయడం ద్వారా బాబర్.. కోహ్లీ రికార్డును అధిగించాడు. ఈ పోరులో బాబర్ (110 నాటౌట్) సెంచరీకి తోడు మహ్మద్ రిజ్వాన్ (88 నాటౌట్) సత్తా చాటడంతో పాక్ 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ను ఓడించింది. తద్వారా మూడు మ్యాచ్ ల సిరీస్ ను 1-1తో సమం చేసింది. టాస్ నెగ్గిన ఇంగ్లండ్ తొలుత 20 ఓవర్లలో 199/5 స్కోరు చేసింది. కెప్టెన్ మొయిన్ అలీ (55 నాటౌట్), బెన్ డంకెట్ (43) సత్తా చాటారు. అనంతరం బాబర్, రిజ్వాన్ ను తొలి వికెట్ కు అజేయంగా 203 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పడంతో పాక్ ఒక్క వికెట్ కోల్పోకుండా మరో 3 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ క్రమంలో టీ20ల్లో తొలి వికెట్ కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం (203) నమోదు చేసిన ఓపెనర్లుగా బాబర్, రిజ్వాన్ రికార్డు నెలకొల్పారు. గతేడాది దక్షిణాఫ్రికాపై 197 పరుగులతో నెలకొల్పిన తమ సొంత రికార్డునే ఈ ఇద్దరూ బద్దలు కొట్టారు.