Brendan Taylor Banned By ICC: బ్రెండన్ టేలర్‌పై మూడేళ్ల పాటు నిషేధం, అప్పుడే సమాచారాన్ని అవినీతి నిరోధక విభాగంతో పంచుకోలేదంటూ కొరడా ఝళిపించిన ఐసీసీ
బుకీలు తనను సంప్రదించినా, ఆ సమాచారాన్ని అవినీతి నిరోధక విభాగంతో (Anti Corruption Code) పంచుకోలేదంటూ జింబాబ్వే క్రికెటర్ బ్రెండన్ టేలర్ పై ఐసీసీ కొరడా ఝళిపించింది.
Dubai [UAE], January 28: స్పాట్ ఫిక్సింగ్ చేయాలంటూ భారత వ్యాపారవేత్త నన్ను సంప్రదించారంటూ జింబాబ్వే క్రికెటర్ బ్రెండన్ టేలర్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. బుకీలు తనను సంప్రదించినా, ఆ సమాచారాన్ని అవినీతి నిరోధక విభాగంతో (Anti Corruption Code) పంచుకోలేదంటూ జింబాబ్వే క్రికెటర్ బ్రెండన్ టేలర్ పై ఐసీసీ కొరడా ఝళిపించింది.
టేలర్ అంశంపై సమగ్ర విచారణ జరిపిన ఐసీసీ అతడిపై మూడున్నరేళ్ల పాటు నిషేధం (Brendan Taylor Banned By ICC) విధించింది. ఈ నిషేధం అన్ని ఫార్మాట్లకు వర్తిస్తుందని తెలిపింది. అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించడంతో పాటు, డ్రగ్స్ తీసుకుని యాంటీ డోపింగ్ కోడ్ ను కూడా అతిక్రమించాడని ఐసీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
బ్రెండన్ టేలర్ ఇటీవలే ఓ లేఖలో సంచలన సంగతులు వెల్లడించడం తెలిసిందే. గతంలో ఓ భారత వ్యాపారవేత్త క్రికెట్ లీగ్ పై చర్చించేందుకు భారత్ రావాలని కోరాడని, తాను వెళితే డ్రగ్స్ తో పార్టీ ఇచ్చి, తాను డ్రగ్స్ తీసుకున్నప్పటి వీడియోతో బ్లాక్ మెయిల్ చేశారని టేలర్ లేఖలో తెలిపాడు. ఫిక్సింగ్ కు పాల్పడాలంటూ తనకు 15 వేల డాలర్లు కూడా ఇచ్చారని వెల్లడించాడు.
అయితే ఈ సమాచారాన్ని తమతో వెంటనే పంచుకోలేదంటూ ఐసీసీ బ్రెండన్ టేలర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. టేలర్ అన్ని ఫార్మాట్లలో కలిపి జింబాబ్వే తరఫున 2004 నుంచి 2021 వరకు 284 మ్యాచ్ లు ఆడాడు. మొత్తం 9,938 పరుగులు చేశాడు. వాటిలో 17 సెంచరీలు ఉన్నాయి. కాగా తన తప్పిదాలను టేలర్ అంగీకరించాడని ఐసీసీ పేర్కొంది.