IPL 2022: నాలుగు మ్యాచ్‌ల పరాజయాల తర్వాత బోణి కొట్టిన చెన్నై, 23 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై ఘన విజయం
మంగళవారం జరిగిన పోరులో 23 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును చిత్తు చేసింది.
ఐపీఎల్ 15వ సీజన్ తొలి నాలుగు మ్యాచ్‌ల్లో పరాజయాలు చవిచూసిన సూపర్ కింగ్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. మంగళవారం జరిగిన పోరులో 23 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. శివమ్ దూబే (46 బంతుల్లో 95 నాటౌట్; 5 ఫోర్లు, 8 సిక్సర్లు), రాబిన్ ఊతప్ప (50 బంతుల్లో 88; 4 ఫోర్లు, 9 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.
ఈ సీజన్‌లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. బెంగళూరు బౌలర్లలో వణిండు హసరంగా రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లకు 193 పరుగులు చేసింది. కెప్టెన్ డుప్లెసిస్ (8), మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (1) విఫలం కాగా.. షాబాజ్ అహ్మద్ (41), ప్రభుదేశాయ్ (34), దినేశ్ కార్తీక్ (14 బంతుల్లో 34; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) పోరాటం ఓటమి అంతరాన్ని తగ్గించడానికే పరిమితమైంది.
చెన్నై బౌలర్లలో మహేశ్ తీక్షణ 4, రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టారు. శివమ్ దూబేకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. లీగ్‌లో భాగంగా బుధవారం ముంబైతో పంజాబ్ తలపడనుంది.