IPL 2022: వారెవ్వా అనిపించిన వార్నర్, విపత్కర పరిస్థితుల్లో జూలు విదిల్చిన ఢిల్లీ, తొమ్మిది వికెట్లతో పంజాబ్ కింగ్స్‌ను చిత్తుచేసిన ఢిల్లీ క్యాపిటల్స్
ఇద్దరు క్రికెటర్లు సహా ఆరుగురికి కరోనా..ఆందోళన గుప్పిట జట్టు..అసలు పంజాబ్‌తో మ్యాచ్ జరుగుతుందో లేదోననే అనుమానాలు..ఇలాంటి విపత్కర పరిస్థితులను అధిగమించి ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals Produce Complete Display) అద్భుత ఆటతో అదరగొట్టింది.
ఇద్దరు క్రికెటర్లు సహా ఆరుగురికి కరోనా..ఆందోళన గుప్పిట జట్టు..అసలు పంజాబ్‌తో మ్యాచ్ జరుగుతుందో లేదోననే అనుమానాలు..ఇలాంటి విపత్కర పరిస్థితులను అధిగమించి ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals Produce Complete Display) అద్భుత ఆటతో అదరగొట్టింది. బుధవారం ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో (DC vs PBKS Stat Highlights) తొమ్మిది వికెట్లతో పంజాబ్ కింగ్స్‌ను చిత్తుచేసింది. తొలుత కుల్దీప్‌యాదవ్ (2/24), అక్షర్ పటేల్ (2/10), లలిత్ యాదవ్ (2/11), ఖలీల్ అహ్మద్ (2/21) విజృంభణతో పంజాబ్ 20 ఓవర్లలో 115 పరుగులకు కుప్పకూలింది. ఢిల్లీ బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో పంజాబ్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. జితేశ్ శర్మ (32), కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (24) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు.
ధవన్ (9), బెయిర్‌స్టో (9), లివింగ్‌స్టోన్ (2), షారుఖ్‌ఖాన్(12) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. స్పిన్ ద్వయం కుల్దీప్, అక్షర్ పటేల్ పంజాబ్ బ్యాటింగ్ నడ్డివిరిచారు. తర్వాత స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ 10.3 ఓవర్లలో వికెట్ కోల్పోయి 119 పరుగులు చేసింది. ఓపెనర్లు వార్నర్ (30 బంతుల్లో 60 నాటౌట్, 10 ఫోర్లు, సిక్స్), పృథ్వీషా (20 బంతుల్లో 41, 7ఫోర్లు, సిక్స్) ధనాధన్ బ్యాటింగ్‌తో అలరించారు. వీరిద్దరు పంజాబ్ బౌలింగ్‌ను అలవోకగా ఎదుర్కొంటూ పరుగులు కొల్లగొట్టారు. మొదట షా దూకుడుగా ఆడితే ఆ తర్వాత వార్నర్ రెచ్చిపోయాడు.
ఈ క్రమంలో పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ బౌలర్లను మార్చిమార్చి ప్రయోగించినా లాభం లేకపోయింది. చాహర్ బౌలింగ్‌లో షా ఔట్ కావడంతో తొలి వికెట్‌కు 83 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. సర్ఫరాజ్‌ఖాన్ (12)తో కలిసి వార్నర్ ఢిల్లీకి భారీ విజయాన్ని కట్టబెట్టాడు. పొదుపైన బౌలింగ్‌తో ఆకట్టుకున్న కుల్దీప్‌యాదవ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. డీవై పాటిల్ స్టేడియం వేదికగా గురువారం ఐపీఎల్ ‘ఎల్‌క్లాసికో’ ముంబై, చెన్నై మధ్య పోరు జరుగనుంది.