IND vs ENG 3rd Test: మూడో టెస్టులో తొలిరోజుకే కుప్పకూలిన టీమిండియా, 78 పరుగులకే ఆలౌట్; ప్రారంభమైన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్, మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్ వివరాల కోసం ఇక్కడ చూడండి

బుధవారం టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా 40.4 ఓవర్లలోనే కేవలం 78 పరుగులకే ఆలౌట్ అయ్యారు. 105 బంతులు ఆడిన రోహిత్ శర్మ 19 పరుగులు...

Ind vs Eng Test 2021 | Photo Credits: PTI)

Leeds, August 25: లీడ్స్‌లోని హెడింగ్లీ వేదికగా ఇంగ్లండ్‌ మరియు ఇండియా మధ్య జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. బుధవారం టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా 40.4 ఓవర్లలో కేవలం 78 పరుగులకే ఆలౌట్ అయింది.  105 బంతులు ఆడిన రోహిత్ శర్మ 19 పరుగులు, 54 బంతులు ఆడిన అజింక్య రహానే 18 పరుగులు మినహా జట్టులోని బ్యాట్స్‌మెన్ ఎవరూ కూడా రెండంకెల స్కోర్ చేయలేదు. పూజారా 1, విరాట్ కోహ్లీ 7, రిషబ్ పంత్ 2, రవీంద్ర జడేజా 4, ఇషాంత్ శర్మ 8, మహ్మద్ సిరాజ్ 3 పరుగులు చేయగా, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బూమ్రాలు పరుగులేమి చేయకుండానే డకౌట్లుగా వెనుదిరిగారు.

ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ ఆండర్సన్ మరియు క్రెయిగ్ ఓవర్టన్ చెరి 3 వికెట్లు, అలాగే సామ్ కర్రాన్, ఒల్లీ రాబిన్సన్ కలిసి చెరి 2 వెకెట్లు పడగొట్టారు. ఫలితంగా టీమిండియా తొలి ఇన్నింగ్స్ ఆట, తొలి రోజే స్వల్ప స్కోరుకు ఆలౌట్ అయింది. ఆ వెంటనే ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. మ్యాచ్ లైవ్ కామెంట్రీ ఈ లింక్ ద్వారా పొందండి.

ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తొలి టెస్ట్ డ్రాగా ముగియగా, రెండో టెస్టులో భారత్ అద్భుత విజయం సాధించింది. సిరీస్‌లో 1-0 తేడాతో భారత్ ముందజంలో ఉంది. మూడో టెస్టులోనూ గెలిచి ఆధిక్యాన్ని పెంచుకోవాలని భావించిన టీమిండియాకు తొలి ఇన్నింగ్స్‌లో గట్టి షాక్ తగిలింది. మూడో టెస్టు ప్రారంభమవుతుందనగా ఇంగ్లండ్- భారత్ ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం మొదలైంది, ఇంగ్లండ్ జట్టు సిరీస్ సమం చేసుకునేందుకు వ్యూహాత్మకంగానే భారత ఆటగాళ్లను రెచ్చగొట్టేలా మాటల యుద్ధానికి దిగుతుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే మూడో టెస్టులో టీమిండియా బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడానికే కష్టపడ్డారంటే పిచ్ ఇంగ్లండ్ ఆటగాళ్లకు అనుకూలంగా తయారు చేయించుకున్నారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వీటికి సమాధానం దొరకాలంటే ఈ టెస్టు మ్యాచ్ పూర్తయ్యే వరకు చూడాల్సిందే.