HC on Child Custody: విడాకుల తీసుకున్నా.. కన్నబిడ్డపై తల్లితో పాటు తండ్రికి కూడా హక్కులు ఉంటాయి, శిఖర్ ధావన్ కేసులో ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు కీలక తీర్పు
ఈ సందర్భంగా అతని మాజీ భార్య అయేషా ముఖర్జికి కోర్టు చీవాట్లు పెట్టింది. తల్లి కస్టడీలో ఉన్న శిఖర్ ధావన్ 9 ఏళ్ల కొడుకు జొరావర్‌ను భారత్‌కు తీసుకురావాలని ఆదేశించింది
క్రికెటర్ శిఖర్ ధావన్ కు దాదాపు మూడేళ్ల తరువాత ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు ద్వారా ఊరట లభించింది. ఈ సందర్భంగా అతని మాజీ భార్య అయేషా ముఖర్జికి కోర్టు చీవాట్లు పెట్టింది. తల్లి కస్టడీలో ఉన్న శిఖర్ ధావన్ 9 ఏళ్ల కొడుకు జొరావర్‌ను భారత్‌కు తీసుకురావాలని ఆదేశించింది. బిడ్డపై తల్లికి మాత్రమే కాకుండా తండ్రికి కూడా హక్కులు ఉంటాయని (Mother Alone Does Not Have Right Over Kid)పేర్కొంది. కేవలం తల్లి మాత్రమే బిడ్డ అన్ని హక్కులను నెరవేర్చలేదని వ్యాఖ్యానించింది.
శిఖర్ ధావన్‌కు, ఆయన భార్య అయేషా ముఖర్జికి మధ్య విభేదాలు రావడంతో ఇద్దరూ విడివిడిగా ఉంటూ విడాకుల కోసం (Shikhar Dhawan and Ayesha Mukherjee Divorce Case) దరఖాస్తు చేసుకున్నారు. కోర్టు జొరావర్‌ను తల్లి కస్టడీకి అప్పగించడంతో 2020లో అయేషా కొడుకును తీసుకుని ఆస్ట్రేలియాకు వెళ్లిపోయింది. ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం తన ఫ్యామిలీ గెట్ టుగెదర్‌కు జొరావర్‌ను తీసుకురావాలని అయేషాను శిఖర్ ధావన్ కోరాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో ధావన్ ఢిల్లీ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు.
అయితే జొరావర్‌కు స్కూళ్లో ముఖ్యమైన క్లాసులు జరుగుతున్నందున తీసుకురాలేనని అయేషా తన న్యాయవాది ద్వారా కోర్టుకు తెలియజేసింది. దాంతో కోర్టు కూడా శిఖర్ ధావన్ అభ్యర్థనను తోసిపుచ్చింది. ఏం చేయలేక శిఖర్ ధావన్ తన ఫ్యామిలీ గెట్ టుగెదర్‌ను వేసవి సెలవుల వరకు వాయిదా వేశాడు.
ఇప్పుడు కూడా తాను జొరావర్‌ను భారత్‌కు తీసుకొచ్చేందుకు అయేషా ససేమిరా అంది. దాంతో శిఖర్ మరోసారి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. ధావన్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు అతని మాజీ భార్యను తప్పుపట్టింది. కొడుపై కేవలం తల్లికి మాత్రమే హక్కులు ఉండవని, తండ్రికి కూడా సమాన హక్కులు ఉంటాయని ఈ సందర్భంగా గుర్తుచేసింది.ధావన్ కుటుంబంలో జరిగే ఫ్యామిలీ గెట్ టుగెదర్‌కు బాబును తీసుకుని రావాల్సిందేనని ఆదేశాలు జారీచేసింది.
మైనర్ బాలుడు కాబట్టి కోర్టు తల్లి కస్టడీకి ఇచ్చినప్పటికీ.. ఏండ్లకు ఏండ్లు తండ్రికి బిడ్డను, బిడ్డకు తండ్రిని చూపించకుండా ఉండే హక్కు తల్లికి లేదని వ్యాఖ్యానించింది. తండ్రి ప్రవర్తన చెడుగా ఉంటే తప్ప.. ఏండ్ల కొద్ది బిడ్డను తండ్రికి దూరం చేసే హక్కు తల్లికి లేదని స్పష్టంచేసింది.