Sandeep Lamichhan Case: 18 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో క్రికెటర్ కు ఊరట, తన తప్పు లేదని తేల్చిన హైకోర్టు, వరల్డ్ కప్ ముందు గుడ్ న్యూస్
తాజాగా ఖాట్మండు జిల్లా కోర్టు సందీప్ కు విధించిన శిక్షను రద్దు చేస్తూ పటాన్ హైకోర్టుకు చెందిన ఇద్దరు న్యాయమూర్తుల ప్యానెల్ తీర్పునిచ్చింది. సాక్ష్యాదారాలు లేవని పేర్కొంటు హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ తీర్పును ఇచ్చింది.
Nepal, May 16: ఖాట్మండులోని ఓ హోటల్ గదిలో క్రికెటర్ సందీప్ లామిచానే (Sandeep Lamichhan) తనపై అత్యాచారం (Rape Case) చేశాడని 18ఏళ్ల బాలిక ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఘటన 2022 ఆగస్టు 21న జరిగింది. వెంటనే లామిచానేను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో కేసు విచారణలో ఉండగా బెయిల్ పై విడుదలయ్యాడు. ఈ ఏడాది ప్రారంభంలో ఖాట్మండు జిల్లా కోర్టు లామిచానేను (Sandeep Lamichhan) దోషిగా నిర్దారించింది. అతడికి ఎనిమిదేళ్లు జైలు శిక్ష విధించింది. దీంతో నేపాల్ క్రికెట్ అసోసియేషన్ కూడా అతడిని సస్పెండ్ చేసింది. తాజాగా ఖాట్మండు జిల్లా కోర్టు సందీప్ కు విధించిన శిక్షను రద్దు చేస్తూ పటాన్ హైకోర్టుకు చెందిన ఇద్దరు న్యాయమూర్తుల ప్యానెల్ తీర్పునిచ్చింది. సాక్ష్యాదారాలు లేవని పేర్కొంటు హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ తీర్పును ఇచ్చింది.
బుధవారం లామిచ్చానే అభిమానులు కోర్టు వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అయితే, అక్కడ ఎలాంటి ఘర్షణ వాతావరణం చోటుచేసుకోకుండా పోలీసులు వారిని అడ్డుకున్నారు. కోర్టుకు వెళ్లే రహదారి ద్వారా లోపలికి రాకుండా అడ్డుకున్నారు. ఇదిలాఉంటే.. కోర్టు తీర్పుతో అతను మళ్లీ నేపాల్ జాతీయ జట్టులో చేరనున్నారు. వచ్చేనెలలో అమెరికా, వెస్టిండీస్ లో టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఇందులో నేపాల్ జట్టు కూడా పాల్గొంటుంది. టీ20 ప్రపంచ కప్ కోసం నేపాల్ జట్టులో సందీప్ లామిచానెను చేర్చుకొనే అవకాశాలు ఉన్నాయి.
సందీప్ లామిచానే లెగ్ స్పిన్నర్.. ఆస్ట్రేలియాలోని బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్), పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్), సీపీఎల్ తో సహా ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రధాన టీ20 లీగ్ లలో ఆడాడు. తన క్రీడాప్రతిభతో అభిమానాన్ని పొందిన క్రికెటర్ గా గుర్తింపు పొందాడు. వన్డే క్రికెట్ లో వేగంగా 50వికెట్లు తీసి ఆ జాబితాలో ప్రపంచంలోనే రెండో స్పిన్ బౌలర్ గానూ నిలిచాడు. టీ20ల్లో 50 వికెట్లు తీసిన మూడో స్పిన్ బౌలర్ గానూ నిలిచాడు. గతేడాది ఆగస్టులో కెన్యాతో నేపాల్ తరపున లామిచానే తన చివరి టీ20 మ్యాచ్ ఆడాడు.