ICC T20 World Cup 2022: రెండుసార్లు ప్రపంచ కప్ విజేతకు షాకిచ్చిన పసికూన, 42 పరుగుల తేడాతో విండీస్‌పై ఘన విజయం సాధించిన స్కాట్లాండ్

నిన్న మాజీ చాంపియన్ శ్రీలంకకు నమీబియా షాకిస్తే.. తాజాగా రెండుసార్లు ప్రపంచ కప్ విజేత వెస్టిండీస్ ను ఓడించి మరో పసికూన స్కాట్లాండ్ సంచలనం సృష్టించింది.

Scotland players (Photo credit: Twitter)

టీ20 ప్రపంచ కప్ లో మరో సంచలనం నమోదైంది. నిన్న మాజీ చాంపియన్ శ్రీలంకకు నమీబియా షాకిస్తే.. తాజాగా రెండుసార్లు ప్రపంచ కప్ విజేత వెస్టిండీస్ ను ఓడించి మరో పసికూన స్కాట్లాండ్ సంచలనం సృష్టించింది. సోమవారం జరిగిన గ్రూప్–బి మ్యాచ్ లో స్కాట్లాండ్ 42 పరుగుల తేడాతో విండీస్ పై ఘన విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 160 పరుగులు చేసింది. 66 పరుగులతో జార్జ్ ముంసే టాప్ స్కోరర్ గా నిలిచాడు. విండీస్ బౌలర్లలో జాసన్ హోల్డర్, అల్జరీ జోసెఫ్ రెండేసి వికెట్లు తీశారు.

క్వాలిఫయర్ మ్యాచ్‌లో పసికూన నమీబియా చేతిలో ఓడిన లంక.. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన నమీబియా.. తమ పేరు గుర్తుపెట్టుకోమని నమీబియా సందేశమిచ్చిందన్న సచిన్.. ట్వీట్ వైరల్

అనంతరం 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన వెస్టిండీస్ 18.3 ఓవర్లలో 118 పరుగులకే కుప్పకూలింది. దాంతో, ప్రపంచ కప్ లో ఘోర పరాజయం మూటగట్టుకుంది. జాసన్ హోల్డర్ (38), కైల్ మెయిర్స్ (20) తప్పితే మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. స్కాట్లాండ్ బౌలర్లలో మార్క్ వాట్ మూడు, అలెగ్జాండర్ లీసాక్ రెండు వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించారు.