IND vs ENG 2nd ODI 2022: ఇంగ్లండ్ బౌలర్ల దెబ్బకు చేతులెత్తేసిన బ్యాటర్లు, 100 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైన భారత్
తొలి వన్డేలో మన పేస్‌కు తలవంచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్‌లాగే... ఇక్కడ ప్రత్యర్థి నిప్పులు చెరిగే బౌలింగ్‌కు భారత్ కుదేలైంది. ఇంగ్లండ్‌తో ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన రెండో వన్డేలో (IND vs ENG 2nd) భారత జట్టు 100 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది.
లార్డ్స్‌లో సీన్ రివర్స్ అయ్యింది. తొలి వన్డేలో మన పేస్‌కు తలవంచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్‌లాగే... ఇక్కడ ప్రత్యర్థి నిప్పులు చెరిగే బౌలింగ్‌కు భారత్ కుదేలైంది. ఇంగ్లండ్‌తో ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన రెండో వన్డేలో (IND vs ENG 2nd) భారత జట్టు 100 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. ఇంగ్లండ్ నిర్దేశించిన 247 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియాకు రీస్ టోప్లీ (Reece Topley's Career-Best Sinks India) చుక్కలు చూపించాడు. వరుసపెట్టి వికెట్లు తీస్తూ క్రీజులో ఆటగాళ్లను కుదురుకోనివ్వకుండా చేశాడు. ఫలితంగా 38.5 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలి దారుణ ఓటమి చవిచూసింది.
టీమిండియాలో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా చేసిన 29 పరుగులే అత్యధికం అంటే బ్యాటింగ్ తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆరుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కూడా దాటలేకపోయారు. వీరిలో కెప్టెన్ రోహిత్ శర్మ, రిషభ్ పంత్, ప్రసిద్ధ్ కృష్ణ డకౌట్ అయ్యారు. విరాట్ కోహ్లీ మరోమారు నిరాశపరిచాడు. 16 పరుగులు మాత్రమే చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 27, షమీ 23 పరుగులు చేశారు. ఈ ఓటమితో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమమైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రీస్ టోప్లీ 9.5 ఓవర్లలో 24 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ మరో ఓవర్ మిగిలి ఉండగానే 246 పరుగులకు ఆలౌట్ అయింది. బంతితో మాయచేసిన స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు తోడు బుమ్రా, హార్దిక్ పాండ్యా జత కలవడంతో పూర్తిగా 50 ఓవర్లు ఆడకుండానే ఆతిథ్య జట్టు చేతులెత్తేసింది. అయితే తొలి వన్డేలో సగం ఓవర్లు కూడా ఆడలేకపోయిన ఇంగ్లండ్ రెండో వన్డేలో మాత్రం 49 ఓవర్ల వరకు బ్యాటింగ్ చేయగలిగింది. 49 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌట్ అయింది.
చాహల్ 4, పాండ్యా, బుమ్రా చెరో రెండు వికెట్లు నేల కూల్చారు. ఇంగ్లండ్ మిడిలార్డర్ కుప్పకూలినప్పటికీ చివరి వరుస బ్యాటర్లు అద్భుతంగా రాణించడంతో పోరాడగలిగే లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచింది. మొయిన్ అలీ 47 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బెయిర్‌స్టో 38, స్టోక్స్ 21, లివింగ్ స్టోన్ 33, విల్లీ 41 పరుగులు చేశారు. సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో వన్డే ఈ నెల 17న మాంచెస్టర్‌లో జరుగుతుంది.