IND vs WI 2nd T20I: క్యాచ్‌లు వదిలేశారు, మ్యాచ్‌నూ వదిలేశారు. రెండో టీ20లో 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్ గెలుపు, సిరీస్ సమం, నిర్ణయాత్మక మూడో టీ20 డిసెంబర్ 11న

రిషబ్ పంత్ 33 * రెండో టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిగతా భారత బ్యాట్స్ మెన్ అందరూ 20 పరుగుల లోపే స్కోర్ చేశారు...

India vs West Indies T20I 2019. (Photo Credits: IANS)

Thiruvananthapuram:  తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన రెండో టీ20 (Ind vs WI 2nd T20i) లో భారత్‌పై వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్ లెండ్ల్ సిమన్స్ (Lendl Simmons) 67 పరుగులతో అజేయంగా చివరి వరకూ నిలవడంతో విండీస్ మరో తొమ్మిది బంతులు మిగిలి ఉండగానే 171 లక్ష్యాన్ని ఛేదించారు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ 1-1తో సమం అయింది.

భారత్ ఫీల్డర్లు క్యాచ్‌లు జారవిడటం, మిస్‌ఫీల్డ్స్ ఎక్కువగా చేయడం ద్వారా ఈ మ్యాచ్ ను చేజార్చుకుంది. వెస్టిండీస్‌కు ఈ మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించిన సిమన్స్ ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయి సర్కిల్ లోనే గాల్లోకి లేపాడు. సులభమైన ఈ క్యాచ్‌ను భారత ఫీల్డర్ వాషింగ్టన్ సుందర్ జారవిడిచాడు. అప్పటికీ సిమన్స్ స్కోరు 10 బంతుల్లో ఆరు మాత్రమే. వాషింగ్టన్ సుందర్ తొలి మ్యాచ్ లోనూ క్యాచ్‌లు జారవిడిచాడు. ఆ తర్వాత అదే ఓవర్లో లూయిస్ క్యాచ్‌ను కూడా వికెట్ కీపర్ రిషబ్ పంత్ వదిలివేశాడు. ఈ అవకాశాలను చక్కగా వినియోగించుకున్న ఈ జోడి, 73 పరుగుల ఉత్తమ ఒపెనింగ్ భాగస్వామ్యాన్ని జోడించింది.

హైదరాబాద్ మ్యాచ్‌లో కోహ్లీ దూకుడు ముందు, భారత ఫీల్డింగ్ తప్పిదాలు బయటపడలేదు కానీ, ఈ మ్యాచ్‌లో అవి తేలిపోయాయి. మొత్తం నాలుగు క్యాచ్‌లను భారత ఫీల్డర్లు జారవిడిచారు.

అంతకుముందు, టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో భారత్ 170/7 స్కోర్ చేయగలిగింది. మూడవ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన శివం దుబే, కెప్టెన్ కోహ్లీ నమ్మకాన్ని నిలబెడుతూ 30 బంతుల్లో 54 పరుగులు చేశాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ అయిన దుబే ఈ మ్యాచ్‌లో ఎన్నో చూడ చక్కని షాట్లు ఆడుతూ ఒకప్పటి యువరాజ్ సింగ్‌ను తలపించాడు. రిషబ్ పంత్ 33 * రెండో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా భారత బ్యాట్స్‌మెన్ అందరూ 20 పరుగుల లోపే స్కోర్ చేశారు.

ఇక నిర్ణయాత్మక మూడో టీ20 డిసెంబర్ 11న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగనుంది.