India vs Australia 3rd T20I: పోరాడి ఓడిన ఇండియా, 12 పరుగుల తేడాతో మూడో టీ20లో ఆస్ట్రేలియా ఘన విజయం, భారత్‌ని గెలిపించని కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం

ఆస్ట్రేలియా12 పరుగుల తేడాతో విజయం (AUS Beat IND by 12 Runs) సాధించి వైట్‌వాష్ నుంచి బయటపడింది.

Virat Kohli (Photo Credits: Twitter/BCCI)

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఆసీస్‌తో జరిగిన మూడో టీ20లో (India vs Australia 3rd T20I) టీమిండియా చివరివరకు పోరాడి ఓడిపోయింది. ఆస్ట్రేలియా12 పరుగుల తేడాతో విజయం (AUS Beat IND by 12 Runs) సాధించి వైట్‌వాష్ నుంచి బయటపడింది. భారత జట్టు చివరి వరకు పోరాడినప్పటికీ పాండ్యా, కోహ్లీ ఓవర్ తేడాలో పెవిలియన్ చేరడంతో ఓటమి తప్పలేదు. కెప్టెన్ విరాట్ కోహ్లీ 85 పరుగులతో ఒంటరి పోరాటం చేసినప్పటికీ అతడి అండగా నిలిచేవారు లేకపోవడంతో టీం ఇండియా పరాజయం పాలైంది.

టాస్‌ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్‌ ఎంచుకొని ఆసీస్‌ను‌ బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్‌ ఆరోన్‌ ఫించ్‌ రెండో ఓవర్‌ వేసిన వాషింగ్టన్‌ సుందర్‌ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితే ఈ ఆనందం టీమిండియాకు ఎంతోసేపు నిలవలేదు.ఫించ్‌ వెనుదిరిగిన అనంతరం క్రీజులోకి వచ్చిన స్మిత్‌తో కలిసి మరో ఓపెనర్‌ వేడ్‌ చెలరేగిపోయాడు. అయితే మరోసారి బౌలింగ్‌కు వచ్చిన సుందర్‌ 24 పరుగులు చేసిన స్మిత్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో ఆసీస్‌ 79 పరుగులు వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. తర్వాత వచ్చిన మ్యాక్స్‌వెల్‌ దాటిగా ఆడడంతో స్కోరుబోర్డు పరుగులెత్తింది.

వన్డే సీరిస్‌కు ప్రతీకారం, టీం 20 సీరిస్ ఇండియాదే, వరుసగా రెండో టీ20లో ఆస్ట్రేలియాపై విజయం సాధించిన భారత్, మూడు టీ20ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న ఇండియా

ఈ దశలో వేడ్ టోర్నీలో వరుసగా రెండో హాఫ్‌ సెంచరీ సాధించాడు. వికెట్ కీపర్ వేడ్ 80 పరుగులతో చెలరేగగా, మ్యాక్స్‌వెల్ 54, స్మిత్ 24 పరుగులు చేశారు. చివరి రెండు ఓవర్లు భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌల్‌ చేయడంతో ఆసీస్‌ 20 ఓవర్లలో 186 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ ముగించింది. టీమిండియా బౌలర్లలో సుందర్‌ 2, నటరాజన్‌, ఠాకూర్‌లు చెరో వికెట్‌ తీశారు.

187 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టుకు తొలి ఓవర్ రెండో బంతికే ఎదురుదెబ్బ తగిలింది. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో ఓపెనర్ రాహుల్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. ధవన్‌ (28)తో కలిసి జాగ్రత్తగా ఆడుతూనే పరుగుల వేగం పెంచాడు. ఇన్నింగ్స్ కుదురుకుంటున్న సమయంలో 74 పరుగుల వద్ద ధవన్ అవుటవడంతో భారత ఇన్నింగ్స్ మళ్లీ ఒడుదొడుకులకు లోనైంది.

సంజుశాంసన్ (10), శ్రేయాస్ అయ్యర్(0) వెంటవెంటనే అవుటయ్యారు. ఆ తర్వాత పాండ్యా క్రీజులోకి రావడంతో టీమిండియా విజయానికి ఢోకా లేదని భావించారు. రెండు సిక్సర్లు బాది ఊపుమీదున్నట్టు కనిపించిన పాండ్యా 20 పరుగులు మాత్రమే చేసి అవుటవడంతో భారత శిబిరం నీరుగారిపోయింది. ఆ తర్వాతి ఓవర్‌లోనే 61 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 85 పరుగులు చేసిన కోహ్లీ కూడా పెవిలియన్ చేరడంతో భారత జట్టు ఓటమి ఖాయమైంది. చివర్లో శార్దూల్ ఠాకూర్ 7 బంతుల్లో 2 సిక్సర్లతో 17 పరుగులు చేసినప్పటికీ ఓటమిని మాత్రం ఆపలేకపోయాడు. 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 174 పరుగులు మాత్రమే చేసిన కోహ్లీ సేన 12 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఆసీస్‌ బౌలర్లలో మిచెల్‌ స్వేపన్‌ 3, మ్యాక్స్‌వెల్‌, అండ్రూ టై, జంపా, అబాట్‌ తలా ఒక వికెట్‌ తీశారు.

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన భారత జట్టు సిరీస్‌ను సొంతం చేసుకోగా, ఈ విజయంతో ఆసీస్ పరువు దక్కించుకుంది. మూడు వికెట్లు పడగొట్టి ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన మిచెల్ స్వెప్సన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.