Ind vs Eng 4th Test: నాలుగో టెస్టులోనూ మారని టీమిండియా బ్యాట్స్‌మెన్‌ ఆటతీరు, తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 191 ఆలౌట్, ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ ఆరంభం, అదరగొట్టిన బౌలర్లు

అయితే కెప్టెన్ విరాట్ కోహ్లీ 96 బంతుల్లో 8 ఫోర్లతో 50 పరుగులు చేయగా, చివర్లో శార్దూల్ ఠాకూర్ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడి 36 బంతుల్లో....

India Vs England 4thTest (Photo Credits: ddsportschannel/twitter)

ఓవల్ వేదికగా భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో భారత బ్యాట్స్‌మన్‌లు మరోసారి తడబడ్డారు. కానీ, బౌలింగ్ లో మాత్రం మెరిసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా బ్యాట్స్‌మన్‌ ఒక్కొక్కరు తక్కువ స్కోర్లకే ఔట్ అవుతూ పెవిలియన్ బాటపట్టారు. భారత బ్యాట్స్‌మన్‌ ఊపు చూస్తే మూడో టెస్టులో లాగా వంద లోపే అలౌట్ అయి వచ్చేస్తారేమో అనిపించింది. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లీ 96 బంతుల్లో 8 ఫోర్లతో 50 పరుగులు చేయగా, చివర్లో శార్దూల్ ఠాకూర్ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడి 36 బంతుల్లో 3 సిక్సులు, 7 ఫోర్లతో 57 పరుగులు చేశాడు. వీరిద్దరి అర్ధ సెంచరీల కారణంగా భారత్ స్కోర్ 200కి చేరువగా వచ్చింది. మిగతా టీమిండియా బ్యాట్స్‌మన్‌ ఎవరి స్కోర్ కూడా కనీసం 20 పరుగులు దాటలేదు. ఇండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది, మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 191 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లండ్ జట్టుకు భారత బౌలర్లు ఆదిలోనే షాక్ ఇచ్చారు. జస్ప్రీత్ బుమ్రా తన నాలుగో ఓవర్‌లోనే ఓపెనర్లు రోరీ బర్న్స్ (5), హసీబ్ హమీద్ (0) ఇద్దరినీ ఔట్ చేశాడు, ఆ తర్వాత ఉమేశ్ యాదవ్ ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ (21) ను క్లీన్ బౌల్డ్ చేయడంతో ఆతిథ్య జట్టు ఓ విలువైన వికెట్ కోల్పోయినట్లయింది. గురువారం తొలి రోజు ఆట ముగిసేసరికి ఇంగ్లండ్ స్కోర్ 52/3 గా ఉండి, ఇంకా 138 పరుగులు వెనుకబడి ఉంది. డేవిడ్ మలన్ (26*) మరియు క్రెయిగ్ ఓవర్టన్ (1*) క్రీజ్‌లో ఉన్నారు.

Here's the update:

5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ లో ప్రస్తుతం ఇండియా మరియు ఇంగ్లండ్ జట్లు చెరో టెస్టు మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా నిలిచాయి. మూడో టెస్టులో ఘోరంగా ఓడిపోయిన టీమిండియా ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ఆధిక్యం పెంచుకోవాలని చూస్తోంది.