India vs England 2nd T20I: కోహ్లీ రికార్డుల వరద, టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం, సిరీస్‌ 1-1తో సమం, ఇంగ్లండ్‌ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్న భారత్

తొలి టీ20లో ఇంగ్లండ్‌ చేతిలో ఎదురైన పరాభవానికి భారత్‌ ఈ మ్యాచ్‌లో ప్రతీకారం తీర్చుకుంది. దీంతో సిరీస్‌ను 1-1తో సమం చేసింది

Team India Captain Virat Kohli | Photo- BCCI

భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య 5 టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం (India vs England 2nd T20I) సాధించింది. తొలి టీ20లో ఇంగ్లండ్‌ చేతిలో ఎదురైన పరాభవానికి భారత్‌ ఈ మ్యాచ్‌లో ప్రతీకారం తీర్చుకుంది. దీంతో సిరీస్‌ను 1-1తో సమం చేసింది. 165 పరుగుల ఛేజింగ్‌లో టీమిండియాకు (India vs England Highlights 2nd T20I, 2021) భారీ ఓపెనింగ్ దక్కింది. మొదట సున్నా పరుగులకే కేఎల్ రాహుల్ డకౌట్ అయినా.. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్(56: 32 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సులు)తో వీర విహారం చేశాడు.

ఇంగ్లండ్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. అతడికి కెప్టెన్ విరాట్ కోహ్లీ*(73: 49 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులు) కూడా తోడవడంతో టార్గెట్‌ ఛేజింగ్ మరింత సులభమైంది. తొలి టీ20లో డకౌట్ అయినప్పటికీ రెండో మ్యాచ్‌లో మాత్రం కోహ్లీ అదరగొట్టాడు. అజేయ అర్థ సెంచరీతో భారత్‌కు విజయాన్ని అందించాడు. వీరితో పాటు 4వ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన రిషబ్ పంత్(26: 13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులు) కూడా మెరుపులు మెరిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో శామ్ కర్రన్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్‌లు తలో వికెట్ తీసుకున్నారు.

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో అర్ధశతకం సాధించాడు. కోహ్లి 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 53 పరుగులు సాధించాడు. కోహ్లి తన హాఫ్‌ సెంచరీని సిక్సర్‌ బాది సాధించడం విశేషం. ఈ స్కోరుతో టీ20 క్రికెట్లో కోహ్లీ సాధించిన పరుగుల సంఖ్య 3వేల మైలురాయిని దాటింది. ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. అలాగే అంతర్జాతీయ క్రికెట్లో 12వేల పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా అందుకున్న ఆటగాడిగా నిలిచాడు.

దీనికోసం కోహ్లీకి కేవలం 226 ఇన్నింగ్సులే పట్టింది. అలాగే టీ20 క్రికెట్లో అత్యథిక సార్లు 50పైగా స్కోరు సాధించిన ఆటగాడిగా కూడా రికార్డు సాధించాడు. ఇంగ్లండ్‌తో రెండో టీ20తో ఇప్పటి వరకూ కోహ్లీ 26 సార్లు అర్థశతకంపైగా సాధించినట్లు అయింది. ఈ జాబితాలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మను వెనక్కు నెట్టిన కోహ్లీ.. అగ్రస్థానాన్ని సాధించాడు.

కోహ్లీ రికార్డులు

1) టీ20ల్లో మూడు వేల పరుగులు చేసిన తొలి అంతర్జాతీయ క్రికెటర్‌గా కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు.

2)అన్ని ఫార్మాట్లలోనూ కలిపి అత్యంత వేగంగా 12 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న తొలి అంతర్జాతీయ క్రికెటర్‌గా నిలిచాడు. 12 వేల పరుగులు చేయడానికి కోహ్లీ 226 ఇన్నింగ్స్‌లు మాత్రమే తీసుకున్నాడు.

3)టీ20ల్లో అత్యధిక అర్థశతకాలు సాధించిన క్రికెటర్‌గా కూడా కోహ్లీ (26) నిలిచాడు. కోహ్లీ తర్వాతి స్థానాల్లో రోహిత్ (25), గప్తిల్ (19) ఉన్నారు.