India vs New Zealand 1st Test 2021: చివరి బంతి వరకు ఉత్కంఠ, భారత్ విజయాన్ని అడ్డుకున్న కివీస్ బ్యాటర్లు, డ్రాగా ముగిసిన తొలి టెస్టు
ఈ మ్యాచ్‌లో (India vs New Zealand 1st Test 2021) విజయం చివరి బంతి వరకు భారత్ వైపే మొగ్గినప్పటికీ కివీస్ బ్యాటర్లు రచిన్ రవీంద్ర (18), అజాజ్ పటేల్ (2) భారత జట్టు విజయాన్ని అడ్డుకున్నారు.
భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగి చివరకు డ్రా అయింది. ఈ మ్యాచ్‌లో (India vs New Zealand 1st Test 2021) విజయం చివరి బంతి వరకు భారత్ వైపే మొగ్గినప్పటికీ కివీస్ బ్యాటర్లు రచిన్ రవీంద్ర (18), అజాజ్ పటేల్ (2) భారత జట్టు విజయాన్ని అడ్డుకున్నారు. ఇద్దరూ ఎలాంటి తొట్రుపాటు లేకుండా భారత బౌలర్లను ఎదుర్కొని వికెట్ల ముందు పాతుకుపోయారు. ఈ జోడీని విడదీసేందుకు భారత బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వీరిద్దరూ పది ఓవర్లపాటు బౌలర్లకు చిక్కుకుండా ఆడి జట్టును ఓటమి నుంచి కాపాడారు.
అంతకుముందు ఈ ఉదయం ఓవర్‌నైట్ స్కోరు 4/1తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కివీస్ తొలుత నిలకడగానే ఆడినప్పటికీ ఆ తర్వాత మాత్రం వడివడిగా వికెట్లు కోల్పోయింది. అశ్విన్, రవీంద్ర జడేజా విజృంభణతో విజయం భారత్ వైపు మొగ్గింది. బౌలర్ల జోరు చూసి భారత్‌దే విజయమని అందరూ భావించారు. అయితే, చివర్లో రచిన్ రవీంద్ర, అజాజ్ పటేల్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి భారత విజయాన్ని అడ్డుకున్నారు.
సీనియర్ బ్యాటర్లు వరుసగా సింగిల్ డిజిట్ పరుగులకే పెవిలియన్‌కు క్యూ కట్టారు. భారత స్పిన్నర్లు తెగ తిప్పేస్తున్నారు. పిచ్‌పై బౌన్స్ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో భారత విజయం లాంఛనమే అనుకున్నారంతా. కానీ వారి ఆశలపై రచిన్ రవీంద్ర (90 బంతుల్లో 18 నాటౌట్), అజాజ్ పటేల్ (23 బంతుల్లో 2) నీళ్లు చల్లారు. భారత స్పిన్ దాడిని ఎదుర్కొంటూ జట్టు ఓటమికి అడ్డుకట్ట వేశారు. మిగతా వారిలో ఎవరూ చెప్పుకోదగ్గ పరుగులు చేయలేదు. భారత బౌలర్లలో జడేజా నాలుగు వికెట్లు పడగొట్టగా, అశ్విన్ 3, అక్షర్ పటేల్ 1, ఉమేశ్ యాదవ్ 1 వికెట్ పడగొట్టారు. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ముంబైలోని వాంఖడే స్టేడియంలో డిసెంబరు 3న ప్రారంభమవుతుంది.