Ind vs SA 3rd T20I: వైజాగ్ అంటే మాములుగా ఉండదు, హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన టీమిండియా- దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌ టికెట్లు, నేటి నుంచి ఆఫ్‌లైన్‌లో టికెట్లు విక్రయం

ఈ నెల(జూన్‌) 14న జరుగనున్న మ్యాచ్‌ కోసం ఆన్‌లైన్‌లో టిక్కెట్లు విక్రయానికి పెట్టగా హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయి.

The Indian team in a huddle (Photo credit: Twitter)

టీమిండియా- దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్‌కు (Ind vs SA 3rd T20I)  విశాఖపట్నంలోని వైఎస్సార్‌ ఏసీఏ వీడీసీఏ స్టేడియం వేదిక కానుంది. ఈ నెల(జూన్‌) 14న జరుగనున్న మ్యాచ్‌ కోసం ఆన్‌లైన్‌లో టిక్కెట్లు విక్రయానికి పెట్టగా హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయి. గంటల వ్యవధిలోనే టికెట్లన్నీ అమ్ముడయ్యాయి. ఈ క్రమంలో బుధవారం(జూన్‌ 8) నుంచి ఆఫ్‌లైన్‌లో టికెట్లు విక్రయించనున్నట్లు ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ తెలిపింది. పీఎం పాలెం క్రికెట్ స్టేడియం, స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం, రామ టాకీస్ దగ్గర కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఇక భారత్‌- సౌతాఫ్రికా మ్యాచ్‌  ( India Vs South Africa T-20 Match) కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రికెట్‌ ప్రేమికులు టికెట్ల కోసం క్యూ లైన్‌లో బారులు తీరారు.

మరోవైపు.. మ్యాచ్ నిర్వహణకు సంబంధించి ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం దక్షిణాఫ్రికా క్రికెట్‌ జట్టు భారత్‌కు చేరుకుంది. ఈ క్రమంలో ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా గురువారం(జూన్‌ 9) ఇరు జట్ల తొలి టీ20 మ్యాచ్‌ జరుగనుంది. కేఎల్‌ రాహుల్‌ సేన, తెంబా బవుమా బృందం మ్యాచ్‌ కోసం ఇప్పటికే ప్రాక్టీసు​ మొదలుపెట్టేశాయి.