IND vs SL 1st T20I 2022: తొలి టీ20లో దుమ్మురేపిన భారత్, 62 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘన విజయం, చరిత్ర సృష్టించిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు
టీమిండియా నిర్ధేశించిన 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లంకేయులు ఏమాత్రం ప్రతిఘటించకుండానే చేతులెత్తేశారు
శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20లో ( IND vs SL 1st T20I 2022) భారత్ ఘన విజయం సాధించింది. టీమిండియా నిర్ధేశించిన 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లంకేయులు ఏమాత్రం ప్రతిఘటించకుండానే చేతులెత్తేశారు. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేసి 62 పరుగుల తేడాతో (IND Beats SL by 62 Runs) ఓటమిపాలయ్యారు. ఈ విజయంతో టీమిండియా 3 మ్యాచ్‌ల సిరీస్‌లో బోణీ కొట్టగా, రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు వరుసగా 10వ టీ20 విజయాన్ని నమోదు చేసింది.
భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, వెంకటేశ్ అయ్యర్ తలో రెండు వికెట్లు, చహల్, జడేజా చెరో వికెట్ పడగొట్టారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఇషాన్ కిషన్ (56 బంతుల్లో 89; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (28 బంతుల్లో 57; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ శర్మ (32 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 44) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోర్ చేసింది. లంక బౌలర్లలో కుమార, షనక తలో వికెట్ దక్కించుకున్నారు.
లంకతో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. 37 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు (3300) చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఈ రికార్డు న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన గప్తిల్ (3299) పేరిట ఉండగా.. హిట్‌మ్యాన్ ఆ రికార్డును బద్ధలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ 32 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 44 పరుగులు చేసి లహిరు కుమార బౌలింగ్‌లో ఔటయ్యాడు.
కెరీర్‌లో ఇప్పటివరకు 123 టీ20లు ఆడిన రోహిత్.. 32.74 సగటుతో 3307 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. పొట్టి క్రికెట్‌లో అత్యధిక పరుగుల జాబితాలో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (3296) మూడో స్థానంలో ఉన్నాడు.