India vs West Indies 1st T20: కోహ్లీ దెబ్బకు కుదేలైన విండీస్, మొదటి టీ20 మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఇండియా ఘన విజయం, 8 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేధించిన భారత్

విండీస్ పై 6 వికెట్ల తేడాతో నెగ్గింది. 208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 18.4ఓవర్లలో 4 వికెట్లను కోల్పోయి 209 పరుగులు చేసి విజయం సాధించింది.

Virat Kohli in action against Windies. (Photo Credits: IANS)

Hyderabad, December 7: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా స్థానిక రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ మైదానంలో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. విండీస్ పై 6 వికెట్ల తేడాతో నెగ్గింది. 208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 18.4ఓవర్లలో 4 వికెట్లను కోల్పోయి 209 పరుగులు చేసి విజయం సాధించింది.కెప్టెన్ కోహ్లీ 94 పరుగులతో చెలరేగడంతో భారత్ సునాయాసంగా విజయ తీరాలకు చేరింది. విశ్వనగరంలో విశ్వరూపం ప్రదర్శించిన కోహ్లి టీమిండియాకు ఒంటి చేత్తో విజయాన్ని అందించి ఔరా అనిపించాడు.

విండీస్‌ నిర్దేశించిన 208 పరుగుల భారీ లక్ష్యాన్ని కోహ్లి సేన మరో 8 బంతులు మిగిలుండగానే ఛేదించింది. లక్ష్య ఛేదనలో విరాట్‌ కోహ్లి (94 నాటౌట్‌; 50 బంతుల్లో 6ఫోర్లు, 6 సిక్సర్లు) అసాధారణరీతిలో బ్యాటింగ్‌ చేయగా.. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌(56; 41 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధసెంచరీతో కెప్టెన్‌కు సహకారాన్ని అందించాడు. విండీస్‌ బౌలర్లలో పియర్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. పొలార్డ్‌, కాట్రెల్‌లు తలో వికెట్‌ దక్కించుకున్నారు.

ICC Tweet

టీమిండియాకు వెస్టిండీస్‌ 208 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. పొట్టి ఫార్మట్‌కు పెట్టింది పేరైన కరేబియన్‌ ఆటగాళ్లు వచ్చిన వారు వచ్చినట్టు యథేచ్చగా బ్యాట్‌ ఝుళిపించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది.

విండీస్‌ ఆటగాళ్లలో హెట్‌మైర్(56; 41 బంతుల్లో 2ఫోర్లు, 4సిక్సర్లు), లూయిస్‌(40; 17 బంతుల్లో 3ఫోర్లు, 4 సిక్సర్లు), పొలార్డ్‌(37;19 బంతుల్లో 1ఫోర్‌, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. చివర్లో జాసన్‌ హోల్డర్‌(24; 9 బంతుల్లో 1ఫోర్‌, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. దీంతో కోహ్లి సేన ముందు విండీస్‌ భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.

భారత బౌలర్లలో చహల్‌ రెండు, జడేజా, చహర్‌, సుందర్‌లు తలో వికెట్‌ పడగొట్టాడరు.