India Vs West Indies: అహ్మదాబాద్ వన్డేలో ఆల్ రౌండ్ ప్రదర్శనతో టీమిండియా ఘన విజయం, చాహల్ దెబ్బకు విండీస్ బ్యాటర్లు చిత్తు..

విండీస్ జట్టు నిర్దేశించిన 177 పరుగుల విజయ లక్ష్యాన్ని 28 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఘన విజయాన్ని అందుకుంది.

INDvWI

అహ్మదాబాద్, ఫిబ్రవరి 06: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో ఇక్కడి నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విండీస్ జట్టు నిర్దేశించిన 177 పరుగుల విజయ లక్ష్యాన్ని 28 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఘన విజయాన్ని అందుకుంది. ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా తొలి వన్డే ఆడిన రోహిత్ అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. 51 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్‌తో 60 పరుగులు చేశాడు. అయితే, అల్జారీ జోసెఫ్ అతడి జోరుకు అడ్డుకట్ట వేసి పెవిలియన్ పంపాడు. దీంతో 84 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ విఫలమయ్యాడు. 4 బంతుల్లో రెండు ఫోర్లు కొట్టి 8 పరుగుల చేసిన కోహ్లీ అల్జారీకే దొరికిపోయాడు. స్వల్ప వ్యవధిలో రెండు కీలక వికెట్లు కోల్పోవడంతో భారత శిబిరంలో కొంత అలజడి రేగింది. మరోవైపు, క్రీజులో కుదురుకున్నట్టుగా కనిపించిన ఓపెనర్ ఇషన్ కిషన్ (20) అవుట్ కావడం, ఆ వెంటనే రిషభ్ పంత్ (11) పెవిలియన్ చేరడంతో భారత జట్టు ఒత్తిడిలోకి జారుకున్నట్టు కనిపించింది.

అయితే, సూర్యకుమార్ యాదవ్ (34), దీపక్ హుడా (26) జాగ్రత్తగా ఆడుతూ జట్టును విజయ తీరాలకు చేర్చారు. ఈ విజయంతో భారత్ 1-0 ఆధిక్యం సాధించింది. ఇంగ్లండ్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ రెండు వికెట్లు తీసుకోగా, అకీల్ హోసీన్ ఒక వికెట్ పడగొట్టాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 43.5 ఓవర్లలో 176 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లు విసిరే పదునైన బంతులను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడిన విండీస్ బ్యాటర్లు క్రీజులోకి వచ్చినంత వేగంగా వెనుదిరిగాడు. ముఖ్యంగా చాహల్ బెంబేలెత్తించాడు. బ్రూక్స్ (12), పూరన్ (18), కెప్టెన్ పొలార్డ్ (0) వంటి కీలక ఆటగాళ్లను వెనక్కి పంపి ఒత్తిడి పెంచాడు.

వాషింగ్టన్ సుందర్ మిగతా పని చూసుకున్నాడు. ఫలితంగా విండీస్ బ్యాటింగ్ పేక మేడను తలపించింది. హోల్డర్ మాత్రం భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ 57 పరుగులు చేశాడు. విండీస్‌ జట్టులో ఇదే వ్యక్తిగత అత్యధికం. ఫాబియన్ అలెన్ 29 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో చాహల్ నాలుగు వికెట్లు పడగొట్టగా, సుందర్ మూడు, సిరాజ్ ఒక వికెట్ నేల కూల్చారు.