India Won Series: దుమ్మురేపిన టీమిండియా, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియాతో సిరీస్ కైవసం, రెండో వన్డేలో 99 పరుగుల తేడాతో ఘన విజయం
ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో 99 పరుగుల భారీ తేడాతో (India Won) ఘన విజయం సాధించింది. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా (Australia) 28.2 ఓవర్లలో 217 పరుగులకు ఆలౌటైంది.
Indore, SEP 24: మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ మూడు వన్డేల మ్యాచ్ సిరీస్‌ను (India vs Ausis) సొంతం చేసుకుంది. ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో 99 పరుగుల భారీ తేడాతో (India Won) ఘన విజయం సాధించింది. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా (Australia) 28.2 ఓవర్లలో 217 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ (53; 39 బంతుల్లో 7 ఫోర్లు, 1సిక్స్), సీన్ అబాట్ (54; 36 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సులు) అర్థశతకాలతో రాణించారు. భారత బౌలర్లలో అశ్విన్, జడేజాలు చెరో మూడు వికెట్లు తీయగా ప్రసిద్ధ్ కృష్ణ రెండు, షమీ ఓ వికెట్ పడగొట్టారు. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా లక్ష్యాన్ని 33 ఓవర్లలో 317 పరుగులకు కుదించారు. అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (104; 97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), వన్‌డౌన్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (105; 90 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీలతో విరుచుకుపడ్డారు.
సూర్యకుమార్ యాదవ్ (72*; 37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు), కెప్టెన్ కేఎల్ రాహుల్ (52; 38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు)లు వరుసగా రెండో మ్యాచ్‌లో అర్థశతకాలతో చెలరేగారు. ఇషాన్ కిషన్ (31; 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా దూకుడుగా ఆడాడు. ఆసీస్ బౌలర్లలో కామెరూన్ గ్రీన్ రెండు, సీన్ అబాట్, హేజిల్‌వుడ్, ఆడమ్ జంపా తలా ఓ వికెట్ పడగొట్టారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు హేజిల్‌వుడ్ షాక్ ఇచ్చాడు. ఫామ్‌లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్(8)ను ఔట్ చేశాడు. దీంతో 16 పరుగుల వద్ద భారత్ మొదటి వికెట్ కోల్పోయింది. ఆ తరువాత ఆస్ట్రేలియాకు సంతోషించడానికి ఏమీ లేకపోయింది. రీ ఎంట్రీలో విమర్శలు ఎదుర్కొంటున్న శ్రేయస్ అయ్యర్ వచ్చి రావడంతో బౌండరీల మోత మోగించాడు. గిల్‌తో కలిసి ఇన్నింగ్స్ నడిపించే బాధ్యతను భుజాన వేసుకున్నాడు.
ఆరంభంలో ఆచితూచి ఆడిన గిల్ ఆ తరువాత వేగం పెంచారు. వీరిద్దరు ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలో గిల్ 31 బంతుల్లో, శ్రేయస్ 41 బంతుల్లో అర్థశతకాలు పూర్తిచేసుకున్నారు. హాఫ్ సెంచరీల తరువాత వీరిద్దరు మరింత ధాటిగా బ్యాటింగ్ చేశారు. కెప్టెన్ స్టీవ్ స్మిత్ బౌలర్లు మార్చి మార్చి ప్రయోగించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆసీస్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా గిల్-శ్రేయస్ జోడి బ్యాటింగ్ చేసింది. మొదట 86 బంతుల్లో శ్రేయాస్ సెంచరీ చేశాడు. వన్డేల్లో శ్రేయస్ కు ఇది మూడో శతకం. సెంచరీ చేసిన కాసేపటికే ధాటిగా ఆడే క్రమంలో సీన్ అబాట్ బౌలింగ్‌లో అతడు ఔట్ అయ్యాడు. గిల్-శ్రేయాస్ జోడి రెండో వికెట్‌కు 200 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.