IPL 2023: ధోనీ దెబ్బకు శుభమాన్ గిల్ సైలెంట్, గుజరాత్ మెడలు వంచుతూ సొంత గడ్డపై గర్జించిన చెన్నై సూపర్ కింగ్స్, సగర్వంగా పదవసారి ఐపీఎల్‌ ఫైనల్లోకి..

బ్యాటింగ్‌.. బౌలింగ్‌లో విశేషంగా రాణించిన ఈ మాజీ చాంపియన్‌ ఏకంగా పదోసారి ఐపీఎల్‌ ఫైనల్లోకి అడుగుపెట్టింది.డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌తో మంగళవారం జరిగిన తొలి క్వాలిఫయర్‌లో ధోనీ సేన 15 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

Chennai Super Kings

సొంతగడ్డపై ధోనీ సేన గర్జించింది. బ్యాటింగ్‌.. బౌలింగ్‌లో విశేషంగా రాణించిన ఈ మాజీ చాంపియన్‌ ఏకంగా పదోసారి ఐపీఎల్‌ ఫైనల్లోకి అడుగుపెట్టింది.డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌తో మంగళవారం జరిగిన తొలి క్వాలిఫయర్‌లో ధోనీ సేన 15 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఐపీఎల్‌ చరిత్రలో గుజరాత్‌ టైటాన్స్‌ మెడలు వంచిన తొలి జట్టుగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ నిలిచింది. ఐపీఎల్‌లో గుజరాత్‌ ఇప్పటివరకు 31 మ్యాచ్‌లు ఆడగా, ఈ మ్యాచ్‌కు ముందు ఒక్కసారి కూడా ఆలౌట్‌ కాలేదు. ఆలౌట్‌ విషయంలో గుజరాత్‌ అన్‌ బీటన్‌ రికార్డును సీఎస్‌కే చెరిపివేసింది.

గుజరాత్‌.. తమ 30 మ్యాచ్‌ల ఐపీఎల్‌ ప్రస్థానంలో (ఈ మ్యాచ్‌కు ముందు వరకు) కేవలం 2 మ్యాచ్‌ల్లో మాత్రమే 9 వికెట్లు కోల్పోయింది. అలాగే ఆ జట్టు ఛేదనలో కేవలం నాలుగు మ్యాచ్‌ల్లో (నిన్నటి ఓటమితో) మాత్రమే ఓడింది. అందులో మూడు మ్యాచ్‌లు (ముంబై, ఢిల్లీ, సీఎస్‌కే) ఈ సీజన్‌లో ఓడినవే. హార్ధిక్‌ సేనకు ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్‌లో ఇది తొలి ఓటమి కావడం మరో విశేషం.అయితే లీగ్‌ దశ ముగిసే సరికి పాయింట్ల పట్టిక టాప్‌లో నిలిచిన గుజరాత్‌కు క్వాలిఫయర్‌-2 రూపంలో ఫైనల్‌ చేరేందుకు మరో అవకాశం ఉంది.

రిటైర్మెంట్‌పై ధోనీ హింట్, మళ్లీ ఆడతానో? లేదో? నాకూ అనుమానమే అంటూ కీలక వ్యాఖ్యలు, సీఎస్‌కే కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానంటూ ప్రకటన

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌ (44 బంతుల్లో 60; 7 ఫోర్లు, ఒక సిక్సర్‌), కాన్వే (34 బంతుల్లో 40; 4 ఫోర్లు) రాణించారు.వీరిద్దరూ తొలి వికెట్‌కు 87 పరుగులు జతచేయగా.. ఆ తర్వాత బరిలోకి దిగిన శివమ్‌ దూబే (1), అజింక్యా రహానే (17), అంబటి రాయుడు (17), రవీంద్ర జడేజా (22) ఆకట్టుకోలేకపోయారు. సొంతగడ్డపై ఈ సీజన్‌లో చివరి మ్యాచ్‌ ఆడిన కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ (1) ఎక్కువసేపు నిలువ లేకపోయాడు. గుజరాత్‌ బౌలర్లలో మహమ్మద్‌ షమీ, మోహిత్‌ శర్మ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

గుజరాత్ టైటాన్స్ కు ధోని సేన దెబ్బ.. తొలి ప్లే ఆఫ్ మ్యాచ్ లో విజయం కైవసం చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్

అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్‌ 20 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. వరుస సెంచరీలతో జోరు మీదున్న యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (38 బంతుల్లో 42; 4 ఫోర్లు, ఒక సిక్సర్‌) కాస్త పోరాడగా.. తక్కినవాళ్లు విఫలమయ్యారు. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (8), సాహా (12), దసున్‌ షనక (17), మిల్లర్‌ (4), విజయ్‌ శంకర్‌ (14), రాహుల్‌ తెవాటియా (3) పెవిలియన్‌కు వరుస కట్టారు. రషీద్‌ ఖాన్‌ (16 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు ఓటమి అంతరాన్ని తగ్గించేందుకే పరిమితమయ్యాయి. చెన్నై బౌలర్లలో దీపక్‌ చాహర్‌, జడేజా, తీక్షణ, పతిరణ తలా రెండు వికెట్లు పడగొట్టారు. రుతురాజ్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. లీగ్‌లో భాగంగా గురువారం చెన్నైలో జరుగనున్న ఎలిమినేటర్‌లో లక్నోతో ముంబై తలపడనుంది.

ఈ క్రమంలో సూపర్ రికార్డు నమోదైంది. ఛేదనలో చివరి ఓవర్లను అభిమానులు భారీ సంఖ్యలో వీక్షించారు. దీంతో వ్యూవర్‌షిప్‌ 2.5 కోట్ల మార్క్‌ను తాకింది. గతంలో (ఏప్రిల్ 17న) చెన్నై - ఆర్‌సీబీ మ్యాచ్‌కు 2.4 కోట్ల వ్యూవర్‌షిప్‌ వచ్చింది. జియో సినిమా తన ట్విటర్‌లో ఈ మేరకు పోస్టు పెట్టింది. ‘కీలకమైన నాలుగు మ్యాచుల్లో (ప్లేఆఫ్స్‌) ఆరంభంలోనే రికార్డును బ్రేక్‌ చేశాం. గుజరాత్ - చెన్నై మ్యాచ్‌ను అభిమానులు విశేషంగా ఆదరించారు’’ అని ట్వీట్ చేసింది.ఇప్పటి వరకు అన్ని మ్యాచ్‌లు కలిపి దాదాపు 1300 కోట్ల వీడియో వ్యూస్‌ను జియో సినిమా దాటేసింది.