Mitchell Marsh Controversy: అందులో తప్పేముంది! వరల్డ్ కప్ పై కాళ్లు పెట్టడాన్ని సమర్ధించుకున్న ఆస్ట్రేలియా క్రికెటర్, మరోసారి వార్తల్లోకి మిచెల్ మార్ష్
ప్రపంచకప్ పై నేను కాళ్లు పెట్టి దిగిన ఫోటో వైరల్ అయ్యింది. దీని గురించి నా స్నేహితులు చెప్పారు. అయితే.. అందులో నాకు ఎలాంటి అగౌరవం కనిపించలేదు.’ అని మార్ష్ వెల్లడించాడు. మార్ష్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. దీనిపై నెటీజన్లు మండిపడుతున్నారు.
Ahmadabad, December, 01: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచులో (CWC Final) టీమ్ఇండియా పై విజయం సాధించిన ఆస్ట్రేలియా ఆరో సారి వన్డే ప్రపంచకప్‌ను (World Cup) ముద్దాడింది. విశ్వ విజేతలుగా నిలవడంతో ఆసీస్ ఆటగాళ్లు చాలా గ్రాండ్‌గానే సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఆసీస్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ (Mitchell Marsh) చేతిలో బీర్ బాటిల్ పట్టుకుని వరల్డ్ కప్ పై కాళ్లు పెట్టి దిగిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటింట్ట అతడిపై తీవ్ర విమర్శలు (World Cup Trophy Controversy) వచ్చాయి. అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు సైతం మార్ష్ ఇలా చేయడం సరికాదని మండిపడ్డారు.
ఈ వివాదంపై ఇన్ని రోజులు సెలెంట్‌గా ఉన్న మార్ష్ (Mitchell Marsh reacts) ఎట్టకేలకు స్పందించాడు. తన చర్యను సమర్థించుకున్నాడు. అందులో తనకు ఎలాంటి తప్పు కనపడడం లేదన్నాడు. దాని గురించి ఎక్కువ ఆలోచించాలని తాను అనుకోవడం లేదని చెప్పాడు. ‘నేను సోషల్ మీడియాను ఎక్కువగా చూడను. ప్రపంచకప్ పై నేను కాళ్లు పెట్టి దిగిన ఫోటో వైరల్ అయ్యింది. దీని గురించి నా స్నేహితులు చెప్పారు. అయితే.. అందులో నాకు ఎలాంటి అగౌరవం కనిపించలేదు.’ అని మార్ష్ వెల్లడించాడు. మార్ష్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. దీనిపై నెటీజన్లు మండిపడుతున్నారు.
ఇదిలా ఉంటే.. మార్ష్ ప్రపంచకప్‌పై కాళ్లు పెట్టడం పై మనదేశంలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీగఢ్ ప్రాంతానికి చెందిన ఆర్‌టీఐ కార్యకర్త పండిట్ కేశవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ గేట్ పోలీసులు కేసు నమోదు చేశారు. కప్పుని అవమానించడంతో పాటు 140 కోట్ల మంది భారతీయుల మనోభావాలను మార్ష్ దెబ్బతీసినట్లు కేశవ్ ఫిర్యాదులో పేర్కొన్నారు.