MS Dhoni Commentry: ధోనీ అభిమానులకు గుడ్ న్యూస్, మళ్లీ టెస్ట్ క్రికెట్‌లోకి ధోని ఎంట్రీ, ఈడెన్ గార్డెన్స్‌లో జరగబోయే తొలి డే-నైట్ టెస్టుకు కమెంటేటర్‌గా వ్యవహరించనున్న మిస్టర్ కూల్
ఆ రెండు రోజులు మాజీ కెప్టెన్లంతా...
2019 ప్రపంచ కప్‌లో భారత్ నిష్క్రమించిన తర్వాత మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) భారత జట్టులోకి మళ్ళీ పునరాగమనం చేయలేదు. అయితే నవంబర్ 22న ఈడెన్ గార్డెన్స్‌లో జరగబోయే తొలి డే-నైట్ టెస్టు మ్యాచ్ (Day-night Test) కు 'గెస్ట్ కమెంటేటర్' గా మహీ వ్యవహరించనున్నట్లు సమాచారం.
2014లో ధోని టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. మళ్లీ 5 ఏళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ లో మహీ సందడి చేస్తుండటం, అది కూడా కమెంటేటర్ అవతారంలో కనిపిస్తుండటంతో అభిమానులు ఆ రోజు కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ టెస్ట్ మ్యాచ్ లో మరో విశేషం ఏమిటంటే, ఇందులో సాంప్రదాయ ఎరుపు బంతికి బదులుగా గులాబీ బంతి (Pink Cricket Ball) ని ఉపయోగించనున్నారు.
నవంబర్ 22 నుండి ఇండియా vs బంగ్లాదేశ్ (India vs Bangladesh) మధ్య కోల్‌కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ చారిత్రాత్మకమైన డే-నైట్ టెస్టు మ్యాచ్ జరుగుతుంది. సందర్భంగా వ్యాఖ్యాతలుగా వ్యవహరించడానికి భారత టెస్ట్ కెప్టెన్లందరినీ ఆహ్వానించాలని 'స్టార్ బ్రాడ్‌కాస్టర్', బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోనీ, అనిల్ కుంబ్లే తదితరులు తమ అనుభవాలను క్రికెట్ వీక్షకులతో పంచుకోకున్నారు.
ఇందుకోసం స్టార్ ఇండియా ప్రత్యేక ప్రణాళికను కూడా సిద్ధం చేసింది. దాని ప్రకారం భారత టెస్టు జట్టుకు సారథ్యం వహించిన మాజీ కెప్టెన్లందరినీ టెస్టు మ్యాచ్ తొలి రెండు రోజులు ఆహ్వానిస్తారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ సహా, జట్టు సభ్యులు, మాజీ కెప్టెన్లు, బీసీసీఐ పెద్దలు మ్యాచ్ ప్రారంభానికి ముందు జాతీయగీతం ఆలాపణలో పాల్గొంటారు. ఆ రెండు రోజులు మాజీ కెప్టెన్లంతా కమెంటరీ బాక్స్ కు వచ్చి తమకు ఇష్టమైన సంఘటనలు, తమ కెరియర్ కు సంబంధించిన విశేషాల గురించి మాట్లాడతారు.
2001లో ఈడెన్ గార్డెన్స్ లో ఆస్ట్రేలియా జట్టుపై టీమిండియా సాధించిన అద్భుత విజయానికి సంబంధించిన విజువల్స్ ను మూడో రోజు మ్యాచ్ మధ్యమధ్యలో ప్రదర్శిస్తారు. ఈ సందర్భంగా ఆ విజయానికి కారకులైన సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, హర్భజన్ సింగ్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్ లకు సంబంధించిన విశేషాలను ప్రదర్శిస్తారు.
ఇక మిగిలిన రెండు రోజుల్లో లంచ్ బ్రేక్ లో మాజీ సారథులు మైదానంలో కొద్ది సేపు క్రికెట్ ఆడేలా స్టార్ టీవీ ప్లాన్ చేసింది. అయితే ఇందుకు బిసిసిఐ ఆమోదం ఇంకా లభించాల్సి ఉంది.
ఇక ఈ టెస్ట్ మ్యాచ్ లో ఎప్పట్నించో పరిశీలనలో ఉన్న గులాబీ బంతిని ఈ చారిత్రాత్మక టెస్టు మ్యాచ్ కు వినియోగిస్తున్న నేపథ్యంలో గులాబీ బంతితో ఆటగాళ్ల చేసే ప్రాక్టీస్ సెషన్లను వీక్షించేందుకు ప్రేక్షకులకు స్టేడియంలోకి ఉచిత ప్రవేశాన్ని కల్పించనున్నారు.
ప్రస్తుతం ఇండియా - బంగ్లాదేశ్ మధ్య టీ20 మ్యాచ్ లు కొనసాగుతున్నాయి. మొదటి టీ20లో ఓడిన టీమిండియా, రెండో మ్యాచ్ లో గెలవాలనే కసితో ఉంది. అయితే 'మహ' తుఫాన్ ప్రభావంతో ఈ మ్యాచ్ కు వర్షం అడ్డుతగిలే సూచనలు కనిపిస్తున్నాయి. నవంబర్ 7వ తేదీన రాజ్ కోట్ వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరగాల్సి ఉంది.